
నింగిలో మేడలు సరే.. నేలపై నడిచే దారేదీ..?
స్మార్ట్‌సిటీ.. గ్లోబల్ సిటీ.. ఆకాశహర్మ్యాలు.. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు ఇవి వినడానికి చాలా బాగున్నాయి.
నగరానికి 12 శాతం ఓట్లు...
‘దేశంలో పాదచారులకు యోగ్యంగా ఉన్న నగరాలు’ అన్న అంశంపై నిర్వహించిన సర్వేలో బెంగళూరుకు 44 శాతం, చెన్నైకు 28 శాతం, పుణెకు 16 శాతం ఓట్లు రాగా హైదరాబాద్‌కు 12 శాతం ఓట్లు మాత్రం లభించాయి.
సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌సిటీ.. గ్లోబల్ సిటీ.. ఆకాశహర్మ్యాలు.. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు ఇవి వినడానికి చాలా బాగున్నాయి. మరి నడక పరిస్థితి ?.. విశ్వనగరంగా అడుగులు వేస్తున్న భాగ్య నగరంలో ప్రజలు భూమిపై నడిచే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, పాదచారుల ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ తీర్మానించింది. సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు కూడా... కానీ, అమలుకు నోచుకోలేదు. సిటీలో ఎక్కడ చూసినా ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురయ్యాయి. ఫలితంగా పాదచారులకు నడకయాతన తప్పడంలేదు. ఆక్రమణల తొలగింపు తంతుగా మారింది. పాలకులు, కమిషనర్లు మారినా ప్రజల నడక కష్టాలు మాత్రం తీరడం లేదు.
మామూళ్లకే ప్రాధాన్యం..
పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను వ్యాపార సంస్థలు.. వీటిపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఆక్రమించారు. పాదచారులు మాత్రం రోడ్డుపైనే నడక సాగిస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలో ఈ తరహా ప్రమాదాలు 40 శాతం ఉండడం తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులకు ఇవేం పట్టడం లేదు. వారిచ్చే మామూళ్లకు అలవాటుపడ్డ వివిధ ప్రభుత్వ విభాగాల ‘స్థానిక’ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు.
మానవహక్కుల సంఘం, కోర్టులు ఆదేశించిన సమయాల్లో మాత్రం హడావుడి చేస్తున్న అధికారులు మొక్కుబడి తంతుగా కొన్నిరోజులపాటు ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. ఆ తర్వాత షరా మామూలే. స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ అంశంలో ప్రజల పక్షాన పోరాడుతున్నా.. కోర్టుల కెక్కుతున్నా పరిస్థితి మారడం లేదు. కోర్టు తీర్పులొచ్చినప్పుడు మాత్రం యుద్ధప్రాతిపదికన ఆరేడువేల ఆక్రమణలు తొలగించామని చెబుతూ, మిగతావి కూడా త్వరలోనే తొలగిస్తామని కోర్టులకు విన్నవించడం పరిపాటిగా మారింది. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల్ని తొలగిస్తామని ఇటీవల కూడా ప్రకటించడం గమనార్హం.
పాదచారులకే తొలి ఓటు
* దేశంలోని ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలు పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. మన నగరంలో మాత్రం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు సైతం వారికి ఉపయోగపడడం లేదు.
* ఇతర దేశాలతోపాటు మన దేశంలోనూ కొన్ని నగరాలు పాదచారుల కోసం తగిన సదుపాయాలు కల్పిస్తున్నాయి.
* దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరులో పాదచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన జీబ్రా క్రాసింగ్స్‌ను అతిక్రమించే వారికి భారీ జరిమానాలు విధిస్తారు.
* బెంగళూరులో పాదచారులు రోడ్డు దాటే సమయంలో పోలీసుల నుంచి తగిన సహకారం లభిస్తుంది.
* ముంబైలో సమర్థవంతమైన సిగ్నలింగ్ వ్యవస్థతో పాదచారులకు సదుపాయంగా ఉంది.
* పుణె కార్పొరేషన్ బడ్జెట్‌లో ఒకటి నుంచి రెండు శాతం వరకు పాదచారుల సదుపాయాలకే ఖర్చు చేస్తారు.
గ్రేటర్‌లో ఇలా..
* ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) నిబంధనల మేరకు, నిర్ణీత ప్రమాణాల కనుగుణంగా ఫుట్‌పాత్‌లు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి.
* ఉన్న ఫుట్‌పాత్‌లు సైతం నడిచేందుకు వీలుగా లేవు.
* వివిధ నగరాల్లో పాదచారుల కోసం ప్రత్యేక సిగ్నల్స్ లేవు.
* రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్కింగ్‌ల్లేవు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నా నిర్వహణ లేదు.
ఉండాల్సిందిలా..
* ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) మార్గదర్శకాల మేరకు ఫుట్‌పాత్‌లు 8 అంగుళాల ఎత్తుకన్నా మించరాదు. రహదారి వెడల్పునకు అనగుణంగా ఫుట్‌పాత్‌లు తగిన వెడల్పుతో ఉండాలి.