హైదరాబాద్ స్టార్టప్‌ల రాజధాని
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘వందల్లో ఉన్న స్టార్టప్‌ల సంఖ్య కేవలం మూడేళ్లలో 3 వేలకు పైగా పెరిగింది. హైదరాబాద్ దేశ స్టార్టప్ రాజధానిగా మారింది’అని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు గోవా ఐటీ మంత్రి రోహన్ కైంటే ఆధ్యర్యంలోని అధికారుల బృందం రెండ్రోజుల పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా బుధవారం కేటీఆర్‌తో గోవా బృందం హైదరాబాద్‌లో భేటీ అయింది. గోవాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సహకారం అందించాల్సిందిగా రోహన్ కోరారు. స్టార్టప్‌లలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణలో అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ–గవర్నెన్స్, ఇన్నొవేషన్, డిజిటల్ లిటరసీ రంగాల్లో సాయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఐటీ పాలసీలు, టీ–హబ్, టాస్క్, టీ–వర్క్స్ వంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా గత మూడేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ఐటీ ఎకోసిస్టమ్‌కు సహాకారం అందించినట్లు చెప్పారు. ప్రఖ్యాత విద్యాసంస్ధలు, పరిశ్రమలను కలుపుకొని టీ–హబ్‌ను రూపొందించినట్లు వివరించారు. టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గోవా ఐటీ పరిశ్రమ అభివృద్దికి కావాల్సిన సహకారాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.