గర్ల్‌ఫ్రెండ్‌ కోసం హైజాక్‌ మజాక్‌ | Hyderabad man sent hijack email to airports to avoid trip with girlfriend | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం హైజాక్‌ మజాక్‌

Published Fri, Apr 21 2017 2:22 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం హైజాక్‌ మజాక్‌ - Sakshi

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం హైజాక్‌ మజాక్‌

చేతిలో చిల్లిగవ్వ లేదు.. గర్ల్‌ఫ్రెండ్‌ ఏమో టూర్‌కు వెళదామంటూ పోరు పెడుతోంది.

► బెదిరింపు ఈ–మెయిల్‌ పంపింది హైదరాబాదీనే
► మధురానగర్‌ నెట్‌ కేఫ్‌ నుంచే ముంబై పోలీసు కమిషనర్‌కు పంపిన వైనం
► నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
► సెల్‌ఫోన్, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం


సాక్షి, హైదరాబాద్‌: చేతిలో చిల్లిగవ్వ లేదు.. గర్ల్‌ఫ్రెండ్‌ ఏమో టూర్‌కు వెళదామంటూ పోరు పెడుతోంది.. ఏం చేయాలో తెలియని హైదరాబాదీ యువకుడు ఆమెకు తొలుత నకిలీ విమాన టికెట్లు పంపాడు.. అయితే ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళితే తన పరువుపోతుందని భావించి విమానం హైజాక్‌ అంటూ ఈ–మెయిల్‌ పంపి అధికారులను పరుగులు పెట్టించాడు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై విమానాశ్రయ భద్రతాధికారులను ఐదురోజులుగా పరుగులు పెట్టించిన హైజాక్‌ బెదిరింపు ఈ–మెయిల్‌ పంపింది హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణగా తేలింది.

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన గర్ల్‌ఫ్రెండ్‌ వేసిన టూర్‌ ప్లాన్‌ను తప్పించుకోవడానికి మధురానగర్‌లోని నెట్‌కేఫ్‌ నుంచి ముంబై పోలీసు కమిషనర్‌కు దీన్ని పంపించాడని సిటీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం, నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేశారని తెలిపారు.

వివాహితుడైనా పక్కదారులు..
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన మోటపర్తి వంశీకృష్ణ అలియాస్‌ వంశీ చౌదరి బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేశాడు. నగరానికి వలస వచ్చిన వంశీ కొంతకాలం బోరబండలో నివసించాడు. ప్రస్తుతం మియాపూర్‌లో ఉంటూ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 2010లో బెదిరింపులు, 2013లో ఆన్‌లైన్‌ మోసం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. వంశీకృష్ణకు 2007లోనే వివాహమైనప్పటికీ ఫేస్‌బుక్‌లో యువతులతో స్నేహం చేయడం, నిత్యం వారితో చాటింగ్‌ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల చెన్నై యువతి వంశీతో టూర్‌కు ప్లాన్‌ చేసింది. ఇద్దరం ముంబై, గోవా వెళ్లి రెండేసి రోజుల చొప్పున గడిపి వద్దామంటూ ప్రతిపాదించింది. తాను చెన్నై నుంచి విమానంలో ముంబై వస్తానని, వంశీని నేరుగా హైదరాబాద్‌ నుంచి రావాలని సూచిస్తూ ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేయమని చెప్పింది. ఆర్థికంగా ‘విమానాన్ని భరించే’ స్తోమత లేని వంశీ ఆ విషయం చెప్తే తన గర్ల్‌ఫ్రెండ్‌ దూరం అవుతుందని భావించాడు.

మధురానగర్‌ నెట్‌ సెంటర్‌ నుంచి..
తాను తరచుగా వెళ్లే మధురానగర్‌లోని ‘ఈ నెట్‌ జోన్‌’నెట్‌ సెంటర్‌కు ఈ నెల 15న వంశీ వెళ్లాడు. అక్కడే (ununn0801@gmail.com) పేరుతో కొత్త ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించాడు. నెట్‌ నుంచే ముంబై పోలీసు కమిషనర్‌ ఈ–మెయిల్‌ ఐడీ సేకరించాడు. వీటి ఆధారంగా కమిషనర్‌కు ఆ రోజు సాయంత్రం 4.47 గంటలకు బెదిరింపు ఈ–మెయిల్‌ పంపాడు. ఈ–మెయిల్‌లో వంశీ తనను హైదరాబాద్‌కు చెందిన యువతిగా పరిచయం చేసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నానని, ఆ సమయంలో దాదాపు 23 మంది యువకులు విమానాల హైజాక్‌ విషయం మాట్లాడుకోవడం తన చెవిన పడిందని పేర్కొన్నాడు. వీరంతా మూడు గ్రూపులుగా ఏర్పడి హైదరాబాద్, చెన్నై, ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో విమానాలు హైజాక్‌ చేయడానికి కుట్ర పన్నారని తెలిపాడు. దీన్ని అందుకున్న ముంబై పోలీసు కమిషనర్‌ తక్షణం సంబంధిత అధికారుల్ని అప్రమత్తం చేయడంతో ఈ మూడు విమానాశ్రయాల్లోనూ 15వ తేదీ సాయంత్రం నుంచి అప్రమత్తత కొనసాగింది. తనిఖీలు ముమ్మరం కావడంతో అనేక విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.

ఐపీ అడ్రస్‌ ఆధారంగా ఈ–మెయిల్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన ముంబై పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జునరెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్‌ దర్యాప్తు చేపట్టారు. ఆ ఐపీ అడ్రస్‌ ‘ఈ నెట్‌ జోన్‌’కు చెందినదిగా గుర్తించారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు వంశీకృష్ణను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్, ఈ–మెయిల్‌ పంపిన కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement