శ్రీకాంత్ మారితే ఆలోచిస్తా: మధుప్రియ
♦ కొలిక్కిరాని గాయని కేసు వ్యవహారం
♦ ఆరు గంటల పాటు కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్: గాయని మధుప్రియ దంపతుల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పెళ్లయిన మూడు నెలల నుంచే తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ భర్త శ్రీకాంత్ వేధింపులకు గురి చేశాడని మధుప్రియ హుమాయున్‌నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధుప్రియతో పాటు ఆమె భర్త శ్రీకాం త్‌కు మానసిక వైద్యులు ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రముఖ డాక్టర్ రాధిక, సైకాలజిస్ట్‌లు వసంత, శాంతితో పాటు ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ గౌస్‌మొహియుద్దీన్, హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్ నేతృత్వంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కౌన్సిలింగ్ జరిగింది. ‘మధుప్రియ, భర్త శ్రీకాంత్‌కు వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాలపై విభేదాలు వస్తున్నాయన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మధుప్రియ మనసు కుదుటపడిన అనంతరం రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటివరకు చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోం’ అని ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్‌మొహియుద్దీన్ తెలిపారు.
శ్రీకాంత్‌పై ఇప్పుడే చర్యలొద్దు: మధుప్రియ
కౌన్సెలింగ్ అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ మంచోడే. అతడిపై ఇప్పుడే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు. కౌన్సిలింగ్‌తో జీవితమంటే నాకో క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్ మంచిగా మారితే రెండో కౌన్సిలింగ్‌కు వస్తా. అప్పటివరకు అమ్మానాన్నతోనే కలసి ఉంటా’ అన్నారు. ‘మధుప్రియను వేధించలేదు. ఎప్పటికైనా ఆమె నాతోనే ఉంటుంది. ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడించ లేదు’ అని శ్రీకాంత్ చెప్పారు.
శ్రీకాంత్ నుంచి ప్రాణభయం: గాయని తండ్రి
కాగా, ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ 15 మంది అనుచరులతో వచ్చి రామంతాపూర్‌లోని తమ ఇంటిపై ఇటుకలతో దాడి చేశాడని మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 147, 148, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, మధుప్రియ కుటుంబసభ్యులే ఇంటికి పిలిపించి మరి తనను చితకబాదారని శ్రీకాంత్ సాక్షి టీవీ చర్చలో వెల్లడించారు. ఆమె తల్లి వల్లే ఈ గొడవలన్నీ అని చెప్పారు. ఇదే చర్చలో మధుప్రియ మాట్లాడుతూ... అసభ్య పదజాలంతో దూషించేవాడని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు.