
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సమయంలో మరో విడత ఐఏఎస్ అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు రోజుల కిందే భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీల్లో పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, కొత్త కలెక్టర్లను అప్రాధాన్య పోస్టుల్లో నియమించడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. అయితే పలు శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు అదనపు బాధ్యతలున్న పోస్టులను సర్దుబాటు చేసేందుకు మరోమారు బదిలీలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండో విడత బదిలీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే పది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జాబితా పంపించింది. ఇక పలు శాఖల్లో కార్యదర్శులుగా ఉన్న ఆరుగురు ఐఏఎస్‌లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించనున్నారు. సీఎస్ ఎస్‌పీ సింగ్ ఆధ్వర్యంలోని పదోన్నతుల కమిటీ 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ జాబితాను కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం (డీవోపీటీ)కి పంపింది. ఈ జాబితాలో శివశంకర్, చంద్రవదన్, పార్థసారథి, విష్ణు, బి.వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ ఉన్నారు. ఈ రెండు అంశాలు ఖరారుకాగానే తదుపరి బదిలీలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కన్ఫర్డ్ జాబితాలో ఉన్నది వీరే..
కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి జాబితాలో పది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు యూపీఎస్సీకి పంపించిన జాబితాలో కొర్రా లక్ష్మి, చిట్టెం లక్ష్మి, కె.ధర్మారెడ్డి, టి.వినయ్‌కృష్ణారెడ్డి, సీహెచ్ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, ఎం.హనుమంతరావు, డి.అమయ్‌కుమార్, కె.హైమావతి, ఎం.హరిత ఉన్నారు. వారం రోజుల్లో ఈ జాబితాకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కలెక్టర్లు లేని కొత్త జిల్లాలను కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జనగామ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మెదక్ జిల్లాలకు ప్రస్తుతం కలెక్టర్లు లేరు. వాటి బాధ్యతలను పక్కన ఉన్న జిల్లాల కలెక్టర్లకే అప్పగించారు.
కలెక్టర్ లేకుండానే.. మేడారం జాతర!
దేశంలోనే అతి పెద్ద గిరిజన పండుగైన మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారు. ఇలాంటి సమయంలో ఆ జాతర జరిగే భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్ లేకపోవడం గమనార్హం. ఇక్కడి కలెక్టర్‌ను బదిలీ చేసి, రెండు వందల కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన సమయం కావటంతో ఈ జిల్లాకు అనుభవమున్న ఐఏఎస్ అధికారిని వెంటనే కలెక్టర్‌గా నియమించాల్సిన అవసరముంది.