
నిమజ్జనంపై సీఎం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు, గంటల తరబడి నిరీక్షణ, తొక్కిసలాట లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆద్యంతం అప్రమత్తంగా వ్యవహరించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సకాలంలో జరగడంతో మొత్తం కార్యక్రమం అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు వీలయిందన్నారు.