ఉద్యోగుల విభజనలో వేగం పెంచండి
డీవోపీటీ అధికారులను కోరిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో అధికారుల అవసరం ఎంతో ఉందని, ఉద్యోగుల విభజన వెంటనే పూర్తిచేయాలని డీవోపీటీ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. డీవోపీటీ కార్యదర్శి సంజయ్ కొఠారీ, సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డెరైక్టర్ మిస్ కిమ్ తదితరులు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగుల విభజనలో జాప్యం వల్ల పరిపాలనలో చిక్కులు వస్తున్నాయన్నారు. దీనికి కొఠారీ బదులిస్తూ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన అంశాన్ని ముఖ్యమైన అంశంగా తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి దాకా 92 శాఖల్లో దాదాపు 84 శాతం ఉద్యోగుల విభజన పూర్తయినట్లు వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకు ఉద్యోగుల విభజన పూర్తిచేస్తామని చెప్పారు. తెలంగాణకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఉన్నందున 30 శాతం అదనంగా కేటాయించినట్లు వెల్లడించారు.