
అప్పుడే షాక్!
→ ఆరు రోజుల్లో 6 ఎంయూలు పెరిగినవిద్యుత్ వినియోగం
→ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్‌ల పేరుతో అనధికారిక కోతలు
→ గ్రేటర్‌లో ఎండల ఎఫెక్ట్ శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 35డిగ్రీలు
సిటీబ్యూరో: నిన్న మొన్నటి వరకు ఎంతో చల్లగా ఉన్న నగరంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం రెట్టింపైంది. గ్రేటర్‌లో శుక్రవారం 35.0 డిగ్రీల గరిష్ఠ, 22.5 కనిష్ఠ ఉష్ణోగ్రత న మోదైంది. ఇలా రోజూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు విద్యుత్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. ఫిబ్రవరి తొలి వారం వరకు విద్యుత్ డిమాండ్ 34-36 మిలియన్ యూనిట్లు ఉంటే... తాజాగా 42.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఉక్కపోత వల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగంపై ప్రభావం పడుతోంది. ఉన్నట్టుండి విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఫీడర్లపై భారం పడి తరచూ ట్రిప్పవుతున్నాయి.
అప్పుడే ముచ్చెమటలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నా యి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం అధికమవుతోంది. దీని వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే ప్రమా దం ఉందని చెబుతూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రతి రెండు గంటలకోసారి 15-20 నిమిషాల పాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో అనధికారిక విద్యుత్ కోతలకు తెర తీశారు. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే... మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పగటి ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వివిధ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ముందస్తు చర్యలు
వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేం దుకు విద్యుత్ సిబ్బంది ఇప్పటికే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ లు తొలగిం చడం.... ఆయిల్ లీకేజీ అవుతున్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి సరిచేయడం...ఇతరత్రా మరమ్మతుల పనుల్లో పనుల్లో నిమగ్నమయ్యారు. సబ్‌స్టేషన్లలోని ఫీడర్ల వారీగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఈ పనులు పూర్తయినట్లు డిస్కం వెల్లడించింది.