
తీరు మారలేదు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దృశ్యం.
=పసిబాలిక హత్యకు గురైనా భద్రత గాలికే....
=మారని రైల్వే పోలీసులు
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ దృశ్యం. మంగళవారం మధ్యాహ్నం పోలీసుల కళ్లుగప్పి మారణాయుధాలతో స్టేషన్‌లో సంచరించిన సైకో.. ముక్కుపచ్చలారని ఏడేళ్ల ప్రియదర్శినిని దారుణంగా హతమార్చాడు. రాష్ర్టవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం నుంచి కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని అందరూ భావిస్తారు.
అయితే ఇక్కడి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిత్యం లక్షకు పైబడిన ప్రయాణికులు, సందర్శకులు రాకపోకలు సాగించే రైల్వేస్టేషన్‌లోని ఈ ప్రధాన ద్వారాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ విధ్వంసాలు జరిగినా, ఉగ్రవాదులు సంచరిస్తున్నారని హెచ్చరికలు వచ్చినా అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేసి ప్రయాణికుల రాకపోకలను ఒక్క ఈ ద్వారం నుంచే అనుమతిస్తారు.
ఇక్కడ మూడు మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, లగేజీలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా రైల్వే పోలీసు సిబ్బందిని నియమించారు. ఇంత కీలకమైన ఈ ద్వారం వద్ద కాపలకాసే రైల్వే పోలీసుల తీరులో ఎన్ని ఘటనలు జరిగినా మార్పు కన్పించడంలేదు. బుధవారం మెటల్ డిటెక్టర్‌లకు మాత్రమే భద్రత విధులు అప్పగించి ఇద్దరు మంతనాల్లో మునిగిపోగా, మరొకరు బల్లపై కూర్చొని సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయడం కన్పించింది.