రియల్ ఢమాల్
=స్థిరాస్తికి విభజన సెగ!
=గ్రేటర్‌లో భారీగా తగ్గిన ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు
=సగానికిపైగా పడిపోయిన రాబడి
=భారీగా తగ్గిన ఒప్పంద పత్రాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కసరత్తు నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తుల లావాదేవీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. గత నాలుగు నెలల నుంచి ఆస్తుల లావాదేవీలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి.. లక్ష్యానికి చాలా దూరంలో నిలిచింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నట్లు జూలై చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అప్పటివరకూ జోరుగా సాగిన భూములు, ఫ్లాట్ల లావాదేవీలు, ఒప్పందాలకు బ్రేకులు పడ్డాయి. సాధారణంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణాలకు స్థలాలను తీసుకుని... వాటికి సంబంధించిన అభివద్ధి ఒప్పందాలు, ఇతర దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు.
ఈ ఒప్పందాల దస్తావేజుల నమోదుతో పాటు ఆస్తుల కొనుగోళ్లు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఎక్కువగా ఇండిపెండెంట్ గృహాలు, ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. కానీ, విభజన ప్రకటనతో నగరంలో స్థిర నివాసాలపై స్థానికేతరులకు ఆసక్తి తగ్గడంతో.. డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల భూములు, ఫ్లాట్ల విలువ పడిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
డిమాండ్ తగ్గడాన్ని ఆసరాగా తీసుకుని కొందరు పెట్టుబడిదారులు ఆస్తులకు చాలా తక్కువ ధర కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చౌకగా అమ్మేందుకు విక్రయదారులు ముందుకు రాకపోవడంతో.. లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఏడాది కింద ఇలాగే లావాదేవీలు పడిపోయినా.. కొద్దిరోజుల్లోనే ఊపందుకోవడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ శాఖకు తగ్గిన ఆదాయం..
స్థిరాస్తుల క్రయవిక్రయాలు తగ్గడం, ఇతర ఒప్పంద పత్రాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో.. హైద రాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ రాబడి సగానికి పైగా తగ్గింది. గత నాలుగు నెలల్లో హైదరాబాద్ పరిధిలో 12,060 దస్తావేజులు మాత్రమే నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 52,424 దస్తావేజులు రిజిస్టరయ్యాయి. అవి కూడా తక్కువ విలువైన కావడంతో లక్ష్యానికి రాబడి దూరంగా ఉండిపోయింది.
విభజన ప్రకటన అనంతరం హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే... గత నాలుగు మాసాల్లో రూ. 253.66 కోట్ల లక్ష్యానికిగాను.. రూ. 135.14 కోట్లు మాత్రమే సమకూరింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ. 623.59 కోట్ల లక్ష్యానికి గాను రూ. 376.70 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అదే గతేడాది రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ. 1529.92 కోట్ల లక్ష్యానికి.. రూ. 1809.76 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ ఏడాది మొదట్లో విభజన ప్రకటన వరకు కూడా.. శివారు సబ్ రిజిస్ట్రార్లలో నెల నెలా రాబడి సగటున 87.3 శాతం వరకు ఉండగా.. తర్వాత క్రమంగా తగ్గుతూ 55.52 శాతానికి పడిపోయింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూలైలో 109.26 శాతం ఉన్న రాబడి, అక్టోబర్‌కు వచ్చేసరికి 50.66 శాతానికి తగ్గింది. చంపాపేటలోనూ అక్టోబర్‌లో 21.77 శాతం మాత్రమే వచ్చింది. ఇలా హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో 41.76 శాతం, పెద్దఅంబర్‌పేటలో 41.43 శాతం, సరూర్‌నగర్‌లో 27.53 శాతం, ఉప్పల్‌లో 54.72 శాతం, వనస్థలిపురంలో 42.20 శాతం రాబడి తగ్గింది.