ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో భవనాలు ఆకాశానికి లేచాయి. నిబంధనలకు విరుద్ధంగా గత టీడీపీ హయాంలో పది అంతస్తుల వరకు ఆ పార్టీ నేతలు నిర్మించారు. అందులో కొన్ని పూర్తి కాగా.. ఇంకొన్ని ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యంత ఎత్తైన భవనాల్లో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. అయినా మున్సిపల్ అధికారులు, పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అపార్ట్‌మెంట్ కల్చర్ అధికంగా ఉంది. అయితే తీసుకున్న అనుమతులుకు.. నిర్మిస్తున్న భవనాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అడిగేవారు లేరని అత్యంత ఎత్తయిన భవనాలు నిర్మించేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ‘జీ ప్లస్ టూ’ అంటే మొదటిది కాకుండా మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోవాలి.
ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు జారీ అయిన తర్వాతనే భవనాలు నిర్మించాలి. అయితే పుట్టపర్తిలో వందకు పైగా భవనాలు 10 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటికి మున్సిపాలిటీ అనుమతులు మాత్రమే ఉన్నాయి. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని.. మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంతస్తులు నిర్మించారు. అయినా ఇంతవరకు యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
నిబంధనలు ఇవే..
పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ (పుడా) నిబంధనల ప్రకారం రెండంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. లే అవుట్ అయితే 10 శాతం స్థలాన్ని ముందుగా పుడాకు అప్పజెప్పాలి. ఆ తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాలి. భవనాల చుట్టూ ఎత్తు ఆధారంగా పుడా నిర్ణయించిన మేరకు స్థలం వదలాల్సి ఉంటుంది. కనీసం 7.5 సెంట్ల కంటే ఎక్కువ స్థలం అయితేనే పుడా పరిధిలోకి వస్తుంది. లేదంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి భారీ భవనాలు వెలిశాయి.
టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని...
- కమ్మవారిపల్లికి చెందిన నారాయణప్ప మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు.
- కమ్మవారిపల్లికి చెందిన మోర్ ఆదెప్ప గ్రౌండ్ ఏరియాలో 10 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కొన్ని అంతస్తులు పూర్తయి నివాసం ఉంటున్నారు. పైన ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
- డ్వాక్రా బజారు వెనుక రోడ్డులో కొందరు ఉపాధ్యాయులు సంయుక్తంగా 8 అంతస్తుల భవనం నిర్మించారు. గోకులంలో టీచర్ వెంకటేశ్.. 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అందులో మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణం తుదిదశకు చేరుకుంది.
నోటీసులు ఇచ్చాం
నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశాం. మరోసారి సర్వే నిర్వహించి.. ఇంకెంత మంది ఉన్నారో అందరికీ నోటీసులు ఇస్తాం. మున్సిపాలిటీ పరిధి జీ ప్లస్ టూ వరకు మాత్రమే. ఆ పై అంతస్తులకు పుడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తాం. అనుమతులు లేకుండా ఇప్పటికే పూర్తి చేసిన భవనాలకు దాని విలువలో 20 శాతం మేర జరిమానా విధిస్తాం.. లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
– కేఎన్ నరేశ్ కృష్ణ, పుడా వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment