‘గ్రేటర్’ ఎమ్మెల్యేలు విభజనను వ్యతిరేకించాలి
విశాలాంధ్ర మహాసభ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 28 మంది శాసనసభ్యులు విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విశాలాంధ్ర మహాసభ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయా నియోజకవర్గాల ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్, లేఖల ద్వారా తెలియజేయాలని కోరింది.
శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని విశాలాంధ్ర మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ కార్యదర్శులు చేగొండి రామజోగయ్య, కేతిరి శ్రీనివాస్‌రెడ్డి, శ్యాం, కృష్ణయ్యతో కలిసి విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి మాట్లాడారు. గ్రేటర్ శాసనసభ్యుల చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్స్‌తో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 80 శాతం మంది ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే శాసన సభ్యులు విభజన బిల్లును వ్యతిరేకించాలని చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము కూడా ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు.