కబ్జాలు..పట్టవా?
అధికారం అండగా నగరంలో కాలువల కబ్జా యథేచ్ఛగా అపార్ట్‌మెంట్లు, భవనాల నిర్మాణం
ఆయకట్టుకు నీళ్లొదిలినా చేరని వైనంప్రశ్నార్థకంగా ఆక్రమణల తొలగింపు మంత్రి హామీలు నెరవేరేనా?
సాక్షి, నెల్లూరు : వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే నెల్లూరు చెరువు కాలువలతో పాటు నగరం మీదుగా వెళ్లే జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి కాలువ, సదరన్, ఈస్ట్రన్, పెన్నాడెల్టా కాలువలపై ఆక్రమణలు ఆగేట్లులేదు. ఇప్పటికే జరిగిన ఆక్రమణలతో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరందే పరిస్థితి లేదు. ఆక్రమించిన కాలువలపై ఇళ్లే కాదు.. ఏకంగా అపార్ట్‌మెంట్లే నిర్మిం చారు. మరికొందరు ఘనులు ఆ స్థలాలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు సైతం చేస్తుండటం విశేషం. కాలువలను కబ్జాచేసి నేతలు రూ. కోట్లు జేబులు నింపుకుంటున్నా.. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోవడం విశేషం. మంగళవారం జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు నగరంలో జరిగిన ఆక్రమణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో నీటిపారుదల కాలువల కబ్జా మరో మారు తెరపైకి వచ్చింది.
ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ కాలువల ఆక్రమణలను పరిశీలించి తక్షణం నివేదిక సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే కాలువలపై భారీ నిర్మాణాలే చేపట్టారు. ఆ సమయంలో ఆక్రమణదారుల జోలికి వెళ్లని అధికారులు ఇప్పుడు కబ్జాల వివరాలూ అందించడం ప్రశ్నార్థకమే. మరోవైపు అధికార పార్టీ వత్తిళ్లు తెలిసిందే. అప్పుడు అధికార పార్టీలో ఉండి కబ్జాలు చేసిన నేతలు ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతల ప్రాపకంతో తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ సాహ సించి వాస్తవ నివేదిక తయారు చేసినా చర్యలుంటాయన్న గ్యారెంటీ కూడా లేని పరిస్థితి. దీంతో నీటిపారుదల కాలువలపై ఆక్రమణల తొలగింపు ప్రశ్నార్థకంగా మారనుంది. కాలువల కబ్జాలను పరిశీలిస్తే... నెల్లూరు చెరువు కింద ఉయ్యాలకాలువ, మల్లప్పకాలువ, గుండ్లపాళెం కాలువ, రామిరెడ్డి డ్రైన్, చింతారెడ్డిపాళెం కాలువ, గచ్చకాలువ తదితర కాలువలు ఉన్నాయి. 12 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కాలువలు అత్యధిక భాగం కబ్జాకు గురయ్యాయి.
ఇప్పటికే వీటిలో 80 శాతం కాలువలు అధికార పార్టీ నేతల కబ్జాతో కనుమరుగు కాగా మిగిలినవి సైతం కుంచించుకపోయి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం 12 వేల ఎకరాలు కాదు కదా 1200 ఎకరాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. నగరంలో పెన్నాడెల్టా, ఈస్ట్రన్, సదరన్, జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి తదితర నీటిపారుదల శాఖకు సంబంధించి కాలువలు ఉన్నాయి. పెన్నాడెల్టాకు సంబంధించి 22 మీడియం కెనాల్స్, నాలుగు ప్రధాన కాలువలు ఉన్నాయి. సదరన్ చానల్‌కు సంబంధించి 26 కాలువలు ఉండగా జాఫర్ సాహెబ్ కెనాల్‌కు 38 కాలువలు, సర్వేపల్లి కెనాల్‌కు సంబంధించి 34 కాలువలు ఉన్నాయి. వేలాది ఎకరాలకు నీరందించే ఈ ప్రధాన కాలువలు సైతం 70 శాతానికి పైగా కబ్జాకు గురయ్యాయి.
నగరంలో కాలువలు, ఆక్రమణలు :
ఉయ్యాలకాలువ : 3 కిలో మీటర్లు పొడవు, 10 అడుగుల వెడల్పన ఉన్న ఈ కాలువ నగరంలోని ఆనం సెంటర్, వినాయకుడిగుడి, కనకమహల్, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా సాగుతుంది. కాలువ పరిధిలో దాదాపు 3 వేల ఎకరాలు ఆయకట్టు ఉండేది. ప్రస్తుతం ఈ కాలువ పరిధిలో 200 ఎకరాలు కూడా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. పూర్తిగా కబ్జాకు గురైంది.
రామిరెడ్డి డ్రైన్ : నగరంలో 7.5 మీటర్ల మేర వెడల్పు ఉన్నకాలువ ఇది. ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రైల్వేబ్రిడ్జి, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ మీదుగా 2.7 కిలో మీటర్లు సాగుతుంది. 2,500 ఎకరాలు ఆయకట్టు ఉండేది. నేడు ఇది కూడా దాదాపు కనుమరుగైంది.
చింతారెడ్డిపాళెం కాలువ: 10 మీటర్ల వెడల్పున 2.5 కిలో మీటర్లు పొడవున ఉండేది. 1,200 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. ఇపుడు నామమాత్రంగా మిగి లింది. కొన్ని చోట్ల 5 అడుగులకు మించి వెడల్పు లేదు. నగరంలో పలుచోట్ల చిన్న డ్రైనేజీలా మారింది. ప్రస్తుతం 500 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది.
మల్లప్పకాలువ : 3 మీటర్లు వెడల్పున 2.7 కిలో మీటర్ల పొడవున ఉండేది. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా సాగేది. గతంలో వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరందించేది. ప్రస్తుతం కుంచించుకుపోయి 400 ఎకరాలకు మాత్రమే నీరందిస్తోంది.
గుండ్లపాళెం కాలువ: 3 మీటర్లు వెడల్పు, 2.5 కిలో మీటర్ల పొడవున ఉన్న ఈ కాలువ నగరంలో మాగుంట లేఅవుట్, ధనలక్ష్మీపురం మీదుగా సాగుతుంది. గతంలో 1,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. ప్రస్తుతం 200 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది.
గచ్చకాలువ : 3.5 మీటర్లు వెడలున, 2.5 కిలో మీటర్లు పొడవున ఉన్న ఈ కాలువ 1,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. ప్రస్తుతం దాదాపు కనుమరుగైన ఈ కాలువ 200 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది.
మొత్తంగా ఈ కాలువల కింద డెరైక్ట్ తూములతో కలిపితే 12 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా నేడు 1200 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరు చేరుతోంది.
మినీబైపాస్ సమీపంలోని ఓవెల్ స్కూల్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన పంట కాలువలను ఆక్రమించి అపార్ట్‌మెంట్లే నిర్మించారు.
మార్బుల్ ఎస్టేట్ ఎదురుగా ఉన్న కాలువ ఆక్రమణకు గురైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అతి దగ్గరగా ఉండే ఓ మాజీ కార్పొరేటర్ కబ్జా చేశాడు.
జీపీఆర్ కల్యాణ మండపం ముందు ఉన్న కాలువను అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేసినట్లు తెలుస్తోంది.
జేమ్స్‌గార్డెన్ ప్రాంతంలో ఉన్న సర్వేపల్లి కాలువలో కలిసే పెద్ద పంట కాలువలను ఆక్రమించి కాంప్లెక్స్ నిర్మించారు.
బాలాజీనగర్, ఏసీనగర్ ప్రాంతంలో ఉన్న సర్వేపల్లి కాలువలు పూర్తిగా ఆక్రమణకు గురై దాదాపు కనుమరుగయ్యాయి.
నగరంలోని ఉయ్యాల కాలువ, నాగిరెడ్డి కాలువలు ఎప్పుడో కనిపించకుండా పోయాయి.
పాత పెద్దాసుపత్రి వద్ద ఉయ్యాల కాలువ, రామలింగాపురం బ్రిడ్జివద్ద రా మిరెడ్డి కాలువలు కబ్జాకు గురయ్యాయి.
మద్రాసు బస్టాండ్ (నెహ్రూ విగ్రహం) వద్ద రామిరెడ్డి కాలువ ఆక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో కాలువ ఆక్రమించి మరో భారీ భవనం నిర్మిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో రోడ్డు అవతలి వైపు కోర్టు ఎదురుగ్గా గతంలో ఆక్రమిత స్థలంపై భవనం నిర్మించడం వివాదాస్పదమైంది.
టెక్కేమిట్ట వద్ద పంట కాలువ అక్రమ నిర్మాణాలతో పూర్తిగా కుంచించుకుపోయింది.
కబ్జాల పర్వంతో నగరంలోని పంట కాలువలు కనుమరుగయ్యాయి. నె ల్లూరు కార్పొరేషన్ అధికారులు అందిన కాడికి డబ్బులు దండుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు.