ప్రయోగాత్మకంగా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్
- బుధవారం నుంచి ప్రారంభమైన ఐఎస్‌సీ సేవలు
- వివిధ కేసుల దర్యాప్తులో దిశానిర్దేశానికి ఏర్పాటు
- ప్రతి ఠాణాకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయింపు
- వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన నగర కొత్వాల్
సాక్షి, హైదరాబాద్: నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును మెరుగుపరచడం, శిక్షల శాతం పెంచడం లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్(ఐఎస్‌సీ) బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా పని చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్ని విభాగాలు, పోలీసుస్టేషన్ల అధికారులకు ఐఎస్‌సీ పనితీరును వివరించారు. ప్రస్తుతం నగరానికి మాత్రమే సేవలందిస్తున్న దీని పరిధిని రాష్ట్ర స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ దర్యాప్తు అధికారికి ఎలాంటి సందేహం వచ్చినా నివృత్తి చేయడానికి అనువుగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత లోపాలను సరిచేసి సిటీలో శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువస్తారు. రెండో దశలో రాష్ట్రంలోని అన్ని విభాగాలు, ఠాణాలకు సేవలు అందించనున్నారు.
మూడు కోణాలూ ఎంతో కీలకం..
ఏదైనా నేరం జరిగినప్పుడు ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించడం, దర్యాప్తు చేయడం నుంచి అభియోగపత్రాలు దాఖలు చేయడం వరకు మూడు కోణాలు అత్యంత కీలక భూమిక పోషిస్తుంటాయి. ప్రాథమికంగా పోలీసులకు సంబంధించిన మాన్యువల్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు దీన్ని అనుసరిస్తూనే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటూ వాటిని పక్కాగా అమలు చేయాల్సిందే. ఈ రెండింటికీ మించి ఘటనాస్థలి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలంటే దానికీ కొన్ని నియమనిబంధనల్ని పాటించాల్సిందే. పోలీసు, లీగల్, ఫోరెన్సిక్.. ఈ 3 కోణాలను పరిగణనలోకి తీసుకుంటూ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే కేసుల దర్యాప్తు మధ్యలోకి వచ్చేసరికో, అభియోగపత్రాలు దాఖలు చేసేటప్పుడో కేసు దర్యాప్తులో ఈ మూడింటికీ మధ్య పొంతన లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే ఐఎస్‌సీ రూపుదిద్దుకుంది.
కేసులపై బదిలీల ప్రభావం ఉండదు..
పోలీసు అధికారులను నిర్దిష్ట సమయాల్లో బదిలీ చేయడం సాధారణం. అయితే ప్రస్తుతం ఓ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి బదిలీ అయితే.. ఆయన స్థానంలోకి వచ్చిన వారే ఆ బాధ్యతలు స్వీకరించాలి. ఇలా కొత్తగా వస్తున్న వారికి ఆ కేసుపై పట్టు ఉండట్లేదు. ఫలితంగా సగం పక్కాగా సాగిన దర్యాప్తు ఆపై లొసుగులతో సాగుతోంది. న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పే సమయంలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలకు ఐఎస్‌సీ పరిష్కారంగా నిలవనుంది. ఓ కేసు నమోదైనప్పటి నుంచి ప్రతి దశలోనూ దీనిపై సెంటర్ అధికారులకు పరిజ్ఞానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు మారినా కేసులు పక్కాగా ముందుకు సాగేలా ఐఎస్‌సీ నిపుణులు జాగ్రత్తలు తీసుకుంటారు.
కాల్‌సెంటర్ మాదిరిగా ఐఎస్‌సీ..
నగర పోలీసు కమిషనరేట్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఐఎస్‌సీలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు, నిపుణులే ఉంటారు. పదవీ విరమణ చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఇద్దరు న్యాయ నిపుణులు, మరో ఇద్దరు ఫోరెన్సిక్/క్లూస్ ఎక్స్‌పర్ట్‌లను నియమించారు. ఒక్కో షిఫ్ట్‌లో ముగ్గురు చొప్పున రెండు షిఫ్టుల్లో 24 గంటలూ ఐఎస్‌సీ లో అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినప్పటి నుంచి ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేసే వరకు ఎలాంటి అనుమానం వచ్చినా ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఫోన్‌కాల్, వీడి యో కాన్ఫరెన్స్, చాటింగ్‌లతో పాటు హైదరా బాద్ పోలీసు కాప్ యాప్ ద్వారానూ నిపుణుల్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. దీనికోసం ప్రతి ఠాణాకు ఓ ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించారు.