యాజమాన్య కోటాలో రిజర్వేషన్లు అక్కర్లేదు | It does not require ownership of reservation quota | Sakshi
Sakshi News home page

యాజమాన్య కోటాలో రిజర్వేషన్లు అక్కర్లేదు

Published Wed, Feb 3 2016 3:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

యాజమాన్య కోటాలో రిజర్వేషన్లు అక్కర్లేదు - Sakshi

యాజమాన్య కోటాలో రిజర్వేషన్లు అక్కర్లేదు

ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీపై హైకోర్టు సంచలన తీర్పు
♦ కన్వీనర్ కోటా సీట్లకే రిజర్వేషన్లు వర్తిస్తాయి
♦ శాసన, అధికార ఉత్తర్వులు లేనప్పుడు రిజర్వేషన్లు కోరలేరు
♦ ఉభయ రాష్ట్రాలు జారీ చేసిన జీవోలకు సమర్థన
♦ ఫీజుల ఖరారు జీవోల్లో జోక్యానికి నిరాకరణ
 
 సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్యపు కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేసే సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) కింద భర్తీ చేసే సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. శాసనపరమైన ఆదేశాలు గానీ, అధికార ఉత్తర్వులు గానీ లేనప్పుడు బీ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్లు కోరడానికి ఎంత మాత్రం వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తొలగిస్తూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది.

ప్రైవేటు యాజమాన్యాలకు లబ్ధిచేకూర్చేందుకే ఇరు ప్రభుత్వాలు బీ కేటగిరీ నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తొలగించాయన్న పిటిషనర్ల వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. అదే విధంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి సైతం హైకోర్టు నిరాకరించింది. ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) సిఫారసుల మేరకు ఏపీ ప్రభుత్వం, ఎఫ్‌ఆర్‌సీ లేనందున కాలేజీల ఆదాయ, వ్యయాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేశాయని హైకోర్టు తెలిపింది. ప్రవేశాలు పూర్తయి, తరగతులు కూడా ప్రారంభమై నాలుగు నెలలవుతున్న నేపథ్యంలో ఫీజు ఖరారు వ్యవహారంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిం ది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యనే తీర్పు వెలువరించింది.

 సవరణ జీవోలు రాజ్యాంగ విరుద్ధం...
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ వృత్తి విద్యా సంస్థల నిబంధనలకు సవరణలు చేస్తూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ గతంలో పిల్ కూడా దాఖలు చేశారు. ఇదే అంశంపై ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే బీ కేటగిరీ సీట్ల ఫీజును రూ. 2.40 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచుతూ జారీ చేసిన జీవోలను కూడా సవాలు చేస్తూ మరికొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వీటన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి ఇటీవల ఉమ్మడి తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ వృత్తి విద్యా సంస్థలు (అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల నియంత్రణ) నిబంధనలు 2007 మేర ఉమ్మడి రాష్ట్రంలో బీ కేటగిరీ కింద సీట్ల భర్తీలో రిజర్వేషన్లు కల్పించారని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనలనే తమకూ వర్తింప చేసుకుందన్నారు. దీని ప్రకారం ఉభయ రాష్ట్రాలు వివిధ వర్గాలకు బీ కేటగిరీ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు కల్పించాలని, అయితే ప్రైవేటు కాలేజీలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ నిబంధనలకు సవరణలు చేస్తూ ఉభయ రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయని పిటిషనర్లు వివరించారు. ఈ సవరణలు రాష్ట్రపతి ఉత్తర్వులకు, రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. అంతేకాక ఈ సవరణ జీవోలను ఎంసెట్-2015 నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత అమల్లోకి తెచ్చారని, కాబట్టి వాటిని 2015-16 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వర్తింప చేయడానికి వీల్లేదన్నారు.
 
 ఒప్పందం మేరకే సవరణ జీవోలు
  పిటిషనర్ల వాదనలను అటు ఉభయ రాష్ట్రాల ఏజీలు, ఇటు ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యం సంఘం తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. ప్రభుత్వాలకు, కాలేజీల యాజమాన్యాల సంఘానికి మధ్య ఒప్పందం ఆధారంగా సవరణ జీవోలు వచ్చాయని, ఫీజు ఖరారు కూడా ఆ ఒప్పందం ఆధారంగానే జరిగిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఏజీలు, కాలేజీల యాజమాన్యం న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. రిజర్వేషన్ల విషయంలో ఇనామ్‌దర్ కేసుతో సహా సుప్రీం కోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఎంసెట్ నోటిఫికేషన్ జారీ అయినంత మాత్రాన ప్రవేశాలపై విద్యార్థులకు ఎటువంటి హక్కు రాదని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ అన్ని వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
 
 ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల కేటగిరీలు
  ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎ-కేటగిరీ సీట్లంటే కన్వీనర్ కోటా సీట్లు. ఇవి ఆ కళాశాలలోని మొత్తం సీట్లలో 50 శాతం. వీటిని ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. బి- కేటగిరీ అంటే యాజమాన్య కోటా సీట్లు. ఇందులో 35 శాతం సీట్లు ఉంటాయి. వీటిని కళాశాల యాజమాన్యాలే ప్రత్యేక పరీక్ష ద్వారా భర్తీ చేసుకుంటాయి. సి-కేటగిరీ సీట్లంటే ప్రవాస భారతీయ (ఎన్నారై) కోటా సీట్లు. ఇవి 15 శాతం ఉంటాయి. వీటిని కూడా నిబంధనలకు లోబడి యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement