కేసీఆర్ వి అనాలోచిత నిర్ణయాలు
మీట్ ది ప్రెస్‌లో లోక్‌సత్తా నేత జేపీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎత్తై భవనాలను నిర్మిస్తామంటారు... ఇందిరా పార్కును ఏదో చేస్తానంటారు... హుస్సేన్‌సాగర్‌ను మరేదో చేస్తా అంటూ... ప్రజలను భ్రమపెడుతున్నారని ఇది మంచిది కాదన్నారు.
తమ ఆస్తులమ్మి చేసినట్లుగా నగరాభివృద్ధిని మేమంటే మేమే చేశామని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో కొంత స్వాహా చేసి, మరి కొంత నగర అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జేపీ మాట్లాడారు. దేశ రాజకీయాలు మార్చడంపై చర్చ జరగాలని, ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన పార్టీల చేతుల్లోకి అధికారం వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే దోచుకోవడం, పైరవీలు చేసుకోవడమే పనిగా మారిందన్నారు. ప్రధాన పార్టీలన్నీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రౌడీలు, భూకబ్జాదారులు, నేరచరిత్ర ఉన్నవారికే టికెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. లోక్‌సత్తా, వామపక్షాలు జెండాలు పక్కకు పెట్టి నిర్దిష్టమైన ఎజెండాతో వన్ హైదరాబాద్ కూటమిగా ముందుకెళ్తున్నాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అంశాల ప్రాతిపదిక ఆధారంగా ఈ కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. సేవలకు కాలపరిమితి పెట్టి, ఆలోపు పూర్తి కాని పక్షంలో సంబంధిత ఉద్యోగికి రోజుకు రూ.200 జరిమానా విధించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు.
ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను కట్టిన పాపానికి ప్రజలను యాచకులుగా చూడకూడదని, పాలనలో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా జవాబుదారి తనం పెంచాలన్నారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను నగరాభివృద్ధితోపాటు 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సౌకర్యాల కల్పనకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.