
జిమ్‌కు సిద్ధంచేసే హైటెక్ అద్దం
అమ్మో బరువు పెరుగుతున్నానే.. ఎలాగైనా తగ్గాలని ఉదయమే లేచి కసరత్తులు చేస్తుంటారు. కొద్ది రోజులు కాగానే ఆ కోరికను పక్కన పెడుతుంటారు. మళ్లీ ఎవరైనా బరువు గురించి మాట్లాడితే కానీ గుర్తురాదు. ఎవరో ఒకరు బరువు గురించి గుర్తు చేస్తే స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండొచ్చు. ఫొటోలో ఉన్న అద్దం బరువు గురించి మనకు గుర్తు చేస్తుంది. బరువు మాత్రమే కాదు శరీరంలో ఎక్కడెక్కడ కొవ్వు పెరిగింది లేదా తగ్గింది అనే విషయాలను చెబుతుంది. అద్దం ముందున్న చిన్న టేబుల్ వంటి నిర్మాణంపై నిల్చొని ఉంటే చాలు. బల్ల గుండ్రంగా తిరుగుతుంటే అద్దంలోని రియల్ సెన్స్ డీప్ సెన్సార్లు శరీరం మొత్తం స్కాన్ చేసేస్తాయి.
చిన్న బల్లతో పాటు అద్దం లోపల ఏర్పాటు చేసిన మరికొన్ని సెన్సార్లు శరీర ఉష్ణోగ్రతను గుర్తించి, కొవ్వు పెరుగుతున్నదెక్కడ, తరుగుతున్నదెక్కడ అనే విషయాలను స్పష్టంగా చెబు తాయి. శరీర సౌష్టవం, భుజం, కండరాల చుట్టుకొలత, తొడలు, నడుం కొలత వంటి వివరాలను అందిస్తుంది. ఇదంతా ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ల సాయంతో కేవలం 20 సెకన్లలోనే జరిగిపోవడం విశేషం. వివరాలను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా త్రీడీ మోడల్ రూపంలో మన మొబైల్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కొన్ని నెలల కాలంలో మన శరీరం ఎలాంటి మార్పులకు గురైందో కూడా యానిమేషన్ రూపంలో చూడవచ్చు.
కచ్చితమైన లెక్కలు..
కొవ్వును గుర్తించేందుకు ఉపయోగించే ‘వాటర్ డిస్‌ప్లేస్‌మెంట్ టెస్ట్’ స్థాయిలో ఇది కేవలం 1.5 శాతం హెచ్చుతగ్గులతో కచ్చితమైన ఫలితాలిస్తుందని దీని రూపకర్త నేకెడ్‌ల్యాబ్స్ సీఈవో ఫర్హాద్ ఫరాబక్షియాన్ చెప్పారు. ఏడాది కాలంగా తాము వేర్వేరు వర్గాల ప్రజలతో ఈ యంత్రాన్ని సమూలంగా పరీక్షించామని, గర్భధారణ సమయంలో జరిగే శరీర మార్పులను కూడా కచ్చితంగా గుర్తించగలిగినట్లు తెలిపారు. శరీరంలో కొవ్వు ఎక్కడెక్కడ పేరుకు పోయిందో తెలిస్తే శరీర భాగానికి తగ్గ వ్యాయామాలు చేయడం.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం సులువు అవుతుందని పేర్కొన్నారు. ఈ యంత్రం ఆరుగురి వివరాలను నిక్షిప్తం చేసుకునేలా రూపొందించామని వివరించారు. వేరే ఎవరైనా దీన్ని వాడుకోవాల్సి వస్తే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలని చెప్పారు.