
మోదీ ప్రసంగంతో నూతనోత్తేజం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మహాసమ్మేళన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో రాష్ర్టంలో కార్యకర్తలకు నూతనోత్తేజం కలిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఒకే బీజేపీ ఎంపీ ఉన్నప్పటికీ సమాఖ్య విధాన స్ఫూర్తితో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ఒకే పర్యటనతో రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. ఇది తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు అని మోదీ చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం, విశ్వాసం పెరిగిందని చెప్పారు. 2019లో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా కేంద్రంలో అవినీతి రహిత పాలన ఉందని మెచ్చుకున్నారని గుర్తుచేశారు.