
మోదీ నిర్ణయంపై విపక్షాల వక్రభాష్యం
• బీజేపీ నేత లక్ష్మణ్ పెద్ద నోట్ల రద్దుపై ప్రజలను
• తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుకు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ అనుకున్న విధంగా నల్లధనంపై నియంత్రణ సాధిస్తే రాజకీయంగా తమకు భవిష్యత్ ఉండదని, ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఎదురవుతున్న సమస్యలను దీర్ఘకాలికమైనవిగా ప్రజల్లో భ్రమలు కలిగించేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయం తర్వాత రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడిందన్నారు.
కొన్ని పార్టీలు ఏకంగా ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరికలు జారీచేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు. పేదలు కూడా ధైర్యంగా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి రావాలన్నది మోదీ లక్ష్యమన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అవేర్‌నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ‘‘నల్లధనం-నిర్మూలన-నరేంద్రమోదీ’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రలోభాలకు గురికాకండి...
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 2004-14 మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ అవినీతి, కుంభకోణాలను పతాకస్థారుుకి తీసుకెళ్లిందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు భూమి, సముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా దోచుకుని, విదేశాల్లో డబ్బును దాచుకున్నారని ఆరోపించారు. జన్‌ధన్ ఖాతాల్లో లక్ష,, రెండు లక్షలు వేస్తామని ఎవరైనా వస్తే ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేదలకు లక్ష్మణ్ విజ్ఞప్తిచేశారు. ఆ విధంగా చేస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కోల్పోయే ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలానికి ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక నిపుణుడు హన్మాండ్లు మాట్లాడుతూ ఆదాయ మార్గాలు, వచ్చిన ఆదాయం గురించి తెలియజేసి పన్నులు కట్టడం ద్వారా మినహా ఈ నోట్ల రద్దు నిర్ణయం నుంచి తప్పించుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. సంస్థ ప్రతినిధులు రాకా సుధాకరరావు, చక్కిలం రఘునాథ్, తదితరులు ఇందులో పాల్గొన్నారు.