ఆ ఇద్దరిలో మొదలైన దడ
♦ ‘పంచాంగం’లో అవినీతి ప్రస్తావన మర్మమేంటి?
♦ సహచర మంత్రులతో లక్ష్మారెడ్డి, కడియం వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మామూలుగా ప్రభు త్వ యంత్రాంగానికి అవినీతి అన్న చెడ్డ పేరు ఉంది. ఇదేదో ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రేపో మాపో అంతమయ్యేది అంతకంటే కాదు! ఏ పని జర గాలన్నా అంతో ఇంతో ముట్టజెప్పుకోవాల్సిందేనన్న భావన ప్రజల్లో నెలకొంది. ఏ శాఖలో అవినీతి ఎక్కువ అంటే ప్రజలు మొదటగా చెప్పేది రెవెన్యూ, రెండోది మున్సిపల్ శాఖ! మరి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ పఠనంలో పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ విద్య, వైద్య శాఖల్లో అవినీతి పెచ్చరిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ పఠనంలో చెప్పడంతో అక్కడే ఉన్న ఆ శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి నివ్వెరపోయారు.
పైకి నవ్వు తూ కనిపించినా తమ రెండు శాఖల పేర్లే ఎందుకు వచ్చాయో అంటూ సహచర మంత్రుల వద్ద వ్యాఖ్యలు చేశారు. పంచాంగ పండితుడు ఈ విషయాలు చెప్పడాన్ని మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు బయటకు కనిపిస్తున్నా దీని వెనుక మరేదైనా మర్మం ఉందా అని ఆరా తీస్తున్నారు. ఒక మంత్రి అయితే పంచాంగ పఠనం తర్వాత పండితుడి దగ్గరకు వెళ్లి ఆ రెండు శాఖల్లోనే అవినీతి ఉంటుందని ఎలా చెప్పగలిగారని అడిగారు. దానికి ఆయన మౌనంగా ఉన్నారట. పంచాంగ పఠనంలో పాల్గొన్న మంత్రులందరిలోనూ దీని పైనే చర్చ జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి నవ్వుతూనే జాగ్రత్తగా ఉండాలని ఆ ఇద్దరు మంత్రులకు సూచించారు!