వైభవంగా ఓయూ శతాబ్ది వేడుకలు | Kadiyam Srihari comments on Osmania University Celebrations | Sakshi
Sakshi News home page

వైభవంగా ఓయూ శతాబ్ది వేడుకలు

Published Fri, Mar 31 2017 3:45 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

వైభవంగా ఓయూ శతాబ్ది వేడుకలు

వైభవంగా ఓయూ శతాబ్ది వేడుకలు

- ఉత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్‌ 26న జరిగే ఉత్సవాల ప్రారంభ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరు కానున్నారన్నారు. రెండోరోజు జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మూడోరోజు జరిగే ఆలిండియా వర్సిటీ వీసీల సదస్సుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గురువారం మంత్రి తన చాంబర్లో యూనివర్సిటీ, విద్యాశాఖ అధికారులతో సమా వేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
 
100 మంది ప్రముఖులకు సత్కారం
ఉస్మానియాలో విద్యాభ్యాసం చేసి వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్న వంద మందిని సన్మానించనున్నట్లు కడియం తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ, ఉమెన్స్‌ కాలేజీ, సికింద్రాబాద్‌ కాలేజీ, సైఫాబాద్‌ కాలేజీ, వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలను విద్యుదీకరణ చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించిందని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లకు మరమ్మతులు, కొత్త హాస్టళ్ల నిర్మాణం, సెంటినరీ బిల్డింగ్, అకడమిక్‌ బ్లాకుల నిర్మాణం చేస్తామన్నారు. వీటితో పాటు ఉమెన్స్‌ కాలేజీ, సైఫాబాద్‌ కాలేజీ, సికింద్రాబాద్‌ సైన్స్‌ కాలేజీ, నిజాం కాలేజీ, వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలను ఆధునీకరిస్తామన్నారు.

వచ్చే ఏడాది ఆలిండియా సైన్స్‌ కాంగ్రెస్‌..
2018 జనవరి 3న ఆలిండియా సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు ఉస్మానియా నిర్వహిస్తోందని, దీనికి ప్రధాని మోదీ రానున్నట్లు తెలిపారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రపం చంలో అందరికీ చేరే విధంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ తెరిచి ఆన్‌లైన్‌ ఆహ్వానాలు పంపుతున్నా మన్నా రు. నగరంలో కూడా హోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీఎం చంద్రశేఖరరావు విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇటీవలే 11 యూనివర్సిటీల్లోని విద్యార్థుల మెస్‌ బకాయిలన్నీ రద్దు చేశారన్నారు. మెస్‌ చార్జీలను గణనీయంగా పెంచారని, ఉపకార వేతనాలు కూడా పెంచారని చెప్పారు.

విద్యార్థులు వీటిని గమనించి వర్సిటీల్లో మంచి అకడమిక్‌ వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని, ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఒక పండగలా నిర్వహించుకోవా లని పిలుపునిచ్చారు. సమీక్షా సమావేశంలో ఎంపీ కేశవరావు, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్‌ గోపాల్‌ రెడ్డి, ఓఎస్డీ లింబాద్రి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement