రాజ‘నీతి’లో మార్పు రావాలి | Kailash Satyarthi receive joint Nobel award | Sakshi
Sakshi News home page

రాజ‘నీతి’లో మార్పు రావాలి

Published Sat, Apr 11 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

రాజ‘నీతి’లో మార్పు రావాలి

రాజ‘నీతి’లో మార్పు రావాలి

* నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి  
* 18 ఏళ్లలోపు వారితో పనులను చేయించకుండా చట్టంలో మార్పులు తేవాలి
* నోబెల్ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోయా  
* అది దేశానికి లభించిన గౌరవం..అందుకే దేశప్రజలకు అంకితమిచ్చా

 
 సాక్షి, హైదరాబాద్: దేశంలో బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా రూపుమాపాలంటే కఠిన చట్టాలతోపాటు రాజకీయ సంస్కృతిలో మార్పురావాలని అప్పుడే దేశం నుంచి ఈ వ్యవస్థను పారదోలగలమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. నాయకులు రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాబోయే తరం గురించి ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న 1986 నాటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టంలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరిస్తూ తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతోపాటు సమాజం కూడా నైతిక బాధ్యత వహిస్తూ బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు.
 
  శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కైలాశ్ సత్యార్థి మీడియాతో మాట్లాడారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఓ మిత్రుడు చెబితే నమ్మలేకపోయానని, ఇది తనకు మాత్రమే కాదని.. దేశానికి లభించిన గౌరవంగా భావించి పురస్కారాన్ని దేశ ప్రజలకు అంకితం చేశానని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిని నిర్మూలిస్తేనే బాలల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, పేదరిక నిర్మూలన వంటి లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. బాలలు కార్మికులుగా మారితే వంద శాతం విద్య సాధ్యపడదన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయించడం.., 18 ఏళ్ల లోపు వయసు వారితో కఠినమైన పనులు చేయించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో 1988 లో తాను చేపట్టిన వరల్డ్ మార్చ్ కారణంగా 179 దేశాలు తమ చట్టాల్లో ఆ మేరకు మార్పులు చేశాయని, కానీ ఇంత వరకూ మన చట్టంలో మార్పులు తేలేకపోయామని సత్యార్థి అసంతృప్తి వ్యక్తం చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్‌ను కూడా సవరించాలని, 18 ఏళ్ల వయోపరిమితి కొనసాగిస్తూనే హత్యలు, అత్యాచారాల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సూచించారు.  మన దేశంలో ఎంతో మంది బాలికలను వ్యవభిచార కూపంలోని దింపుతున్నారని, పసి పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నోబెల్ గ్రహీత ఆవేదన చెందారు. బాలికలపై జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలను రూపుమాపనంత వరకూ లక్ష్మీ, దుర్గా, సరస్వతి మాతలను కొలిచే నైతిక హక్కు మనకు లేదన్నారు.
 
 బాలికల రక్షణకు ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. తనకు నోబెల్ వచ్చాక దేశ వ్యాప్తంగా బాలల దుస్థితిపై అవగాహన పెరిగిందని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరింత చురుకుగా పనిచేస్తుండడం సంతోషకరంగా ఉందని అన్నారు. అయితే దేశంలో ఇంకా లక్షలాది మంది పిల్లలు పరిశ్రమలు, కర్మాగారాల్లో మగ్గుతున్నారని, వారందరికీ స్వేచ్ఛ ప్రసాదించేందుకు ప్రతి ఒక్క పౌరుడూ కృషి చేయాలని సత్యార్థి కోరారు. ప్రపంచంలో ఏ ఒక్క పిల్లవాడు కూడా తన స్వేచ్ఛను నష్టపోకూడదన్నదే తన లక్ష్యమని, దాని కోసం చివరి వరకూ పోరాడతానని సత్యార్థి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమాకాంత్, కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు.
 
 సమాజ హితమే లక్ష్యం కావాలి: ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో సత్యార్థి
 సాక్షి, హైదరాబాద్: విద్యాధికులు సమాజ, ప్రపంచహితం కోసం కృషి చేయాలని సత్యార్థి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని, నిత్యాన్వేషిగా ఉండాలని, నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా పట్టభద్రులను కోరారు. ‘‘మీలో ఒకొక్కరూ ఓ అగ్ని కణం. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపగల సామర్థ్యం మీ సొంతం. ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపండి’’ అని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి, బాలల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రులు తనను పిచ్చివాడన్నారని గుర్తు చేసుకున్నారు. అయినా మనసు చెప్పిన మాట వినడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును చిన్న కథల రూపంలో చెప్పారు.
 
  ‘‘ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకపోయి ఉంటే విద్యార్థుల కుటుంబసభ్యుల మధ్య కూర్చుని ఉండేవాడిని. నా కుమార్తె మేనేజ్‌మెంట్ పట్టాను అందుకోవడం చూస్తూ, ఆమె స్కూలుకెళ్లిన తొలి రోజున నేను రాసుకున్న కవితను గుర్తు చేసుకునేవాడిని’’ అంటూ దాన్ని చదివి వినిపించారు. ‘నా కుమార్తె తొలిసారి బడికెళ్లింది. ప్రపంచాన్ని జయించే కొత్త అస్త్రశస్త్రాలను సమకూర్చుకునేందుకు బయల్దేరింది’ అనే అర్థంతో సాగిన ఆ హిందీ కవితను అంతా ఆస్వాదించారు. సత్యార్థి తన ప్రసంగానికి ముందు పట్టభద్రులను కాకుండా చిన్నపిల్లలను పలకరించడం ఆకట్టుకుంది. ఐఎస్‌బీ అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా ఎదిగిందని సంస్థ డీన్ అజిత్ రంగనేకర్ అన్నారు. ‘‘దాదాపు ఏడు వేల మంది పూర్వ విద్యార్థుల్లో 200 మంది అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. 23 దేశాల్లో ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులుండటం సంస్థ సామర్థ్యానికి గీటురాయి’’ అని చెప్పారు. ప్రభుత్వాల విధాన రూపకల్పన తదితరాల్లోనూ ఐఎస్‌బీ పాలుపంచుకుంటోందన్నారు. స్నాతకోత్సవంలో 2015 ఏడాదికి 551 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ పట్టాలు, 62 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 2014కు పీజీపీ మ్యాక్  కోర్సు పట్టాలు అందుకున్నారు. ఐఎస్‌బీ బోర్డు సభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఆది గోద్రెజ్, రాహుల్ బజాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement