దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు.. | kcr given homi to slum free city | Sakshi
Sakshi News home page

దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు..

Published Fri, Aug 15 2014 1:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు.. - Sakshi

దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు..

ఈ వెతల ‘చెర’ఇంకెన్నాళ్లు
 
స్వాతంత్య్ర దినోత్సవం అంటే ‘పతాక’ స్థాయి సంబరం. ఇది ఏటా వచ్చేదే అయినా ఈసారి ప్రత్యేకత ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొట్టతొలి జెండా పండుగ ఇది. తెలంగాణ సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం చారిత్రక గోల్కొండ కోటను వేదికగా ఎంచుకుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న సంతోషంలో అంబరాన్నంటేలా పంద్రాగస్టు సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ తరుణంలో నగరవాసి గుండెల నిండా జెండా పండుగ సంబరాలు ప్రతిఫలిస్తున్నా.. ఏదో వెలితి.
 
నాడు దాస్య శృంఖలాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితంగా స్వాతంత్య్రం లభించినా.. నేటికీ మన చుట్టూనే తిష్టవేసి ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి మాత్రం విముక్తి లభించట్లేదు. ఇంకెన్నేళ్లు ఈ సమస్యలపై పోరాడాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని, విశ్వనగరంగా కీర్తిపతాక ఎగురవేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిజమై, హామీలు అమలై ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతుల్లో మార్పు రావాలని ఆశిస్తున్నారు.
 
కనీస సదుపాయాలు సమకూరి, అంతా నాణ్యమైన జీవనం గడిపిన నాడే నగరవాసి సమస్యల చెర నుంచి బయటపడినట్టని, కొత్త ప్రభుత్వ హయాంలోనైనా పాత సమస్యల నుంచి విముక్తి కలగాలని అంతా కలలు కంటున్నారు. ఆ కలలు సాకారం కావాలంటే, ఆశలు నెరవేరాలంటే మొదట ఈ సమస్యలు తీర్చాలని నగరవాసులు ఏకరువు పెడుతున్నారు.     - సాక్షి, సిటీబ్యూరో
 
నడక యాతన ఇంకెన్నాళ్లు?

గ్రేటర్‌లో 7 వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నా.. ప్రజలు నడిచేందుకు ఒక్క మార్గమూ సరిగా లేదు. పాదచారులు నడిచేందుకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలయ్యాయి. ఇక కాస్తో కూస్తో ఉన్న వాటిపై నడిచే పరిస్థితి లేదు. ఫలితంగా ఏటా దాదాపు 200 మంది పాదచారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్న వారిలో 40 శాతం మంది పాదచారులే కావడం విషాదం. ‘పాదచారే మహారాజు’ అనేది నినాదానికే పరిమితమైంది. కేసీఆర్ సర్కారు మొదట పాదచారుల కష్టాలు తప్పించాల్సి ఉంది. నగరంలో రోడ్డు దాటడమంటే మాటలు కాదు. అవసరమైన చోట్ల ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయాలి. రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్కింగ్‌లు ఉండాలి. వాటిని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి.
 
ఇంటి నంబరు ఓ పజిల్
ప్రస్తుతం సమగ్ర సర్వేకు సర్కారు సిద్ధమైంది. ఈ నిమిత్తం ఇంటింటికి వెళ్లే అధికారులకే మతిపోయేలా నగరంలో ఇంటి నంబర్లు ఉన్నాయి. అస్తవ్యస్తపు ఇళ్ల నంబర్లతో గజిబిజి గల్లీలతో నగరంలో చిరునామా కనుక్కోవడం అంత ఈజీ కాదు. సులభంగా, శాస్త్రీయ పద్ధతిలో ఇంటి నంబర్లుండాలనే ఆలోచన పాతదే అయినా, అమలుకు నోచలేదు. దశాబ్దాలుగా, ప్రభుత్వాలు మారుతున్నా కొలిక్కిరాని ఈ సమస్యను టీఆర్‌ఎస్ సర్కారైనా పరిష్కరిస్తుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
 
అభివృద్ధి నీడలో మురికివాడల జాడ
ఎన్నెన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన రాజధానిలో మురికివాడలూ తక్కువేం లేవు. సీఎం కేసీఆర్ ‘స్లమ్ ఫ్రీ సిటీ’ చేస్తామని హామీనిచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ముందు నగరంలో మురికివాడలు లేకుండా చేయాలని పేదలు కోరుతున్నారు. బ్రాండ్ ఇమేజ్ సాధనకు ముందు ప్రజలందరికీ కనీస సదుపాయమైన గూడు గోడు తీర్చాలి. గ్రేటర్‌లో ఇప్పటికే గుర్తించిన 1476 స్లమ్స్ రూపురేఖలు మార్చడంతోపాటు.. కొత్తగా ఏర్పడిన వాటినీ గుర్తించి మురికివాడరహిత నగరంగా తీర్చిదిద్దాలి. జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకం ద్వారా గ్రేటర్‌కు 78,746 ఇళ్లు వుంజూరు కాగా ఆరేళ్లుగా పదివేల మందికీ లబ్ధి చేకూరలేదు.
 
‘చెత్త’శుద్ధి ఏదీ?
జీహెచ్‌ఎంసీ ఏటా రూ.225 కోట్లు పారిశుధ్య కార్మికులకు వేతనాలుగా చెల్లిస్తున్నా, దాదాపు 20 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నా చెత్త సమస్య తీరట్లేదు. రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్తే.. ఈ పరిస్థితిని మెరుగుపర్చాల్సి ఉంది. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టులను అమలుచేయాలి. తద్వారా పారిశుధ్య ఇబ్బంది తీరడంతో పాటు విద్యుత్ అవసరాలూ కొద్దిమేర తీరతాయి. కొన్ని రోడ్లను మాత్రమే చెత్తరహితంగా కాకుండా అన్నిటినీ అదే మాదిరిగా తీర్చిదిద్దాలి.
 
ముంపు ముప్పు తప్పేనా?

పేరుగొప్ప నగరంలో వానొస్తే రోడ్లే చెరువులయ్యే దుస్థితి. ఇందుకు కారణం వరద నీటి కాలువలు కుంచించుకుపోవడమే. నాలాల విస్తరణ, అభివృద్ధికి వందల కోట్ల నిధులున్నా.. పనులు సాగట్లేదు. నగరాభివృద్ధికి తగిన మాస్టర్‌ప్లాన్‌కు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు పొందేందుకు సిద్ధమైన ప్రభుత్వం వరదనీటి కాలువల విస్తరణపైనా శ్రద్ధచూపాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే తప్ప రాదార్లు గోదారులయ్యే సమస్య నుంచి నగరం బయటపడదు. వివిధ ప్రాంతాల్లో 71 కిలోమీటర్ల మేర నాలాల వెడల్పు/ఆధునీకరణకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నుంచి రూ.266 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆరేళ్లుగా పనులు అతీగతీ లేవు. ఇప్పటికి రూ.125 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వచ్చే మార్చి వరకు మాత్రమే గడువుంది. ఈలోగా ఏంచేస్తారో.. ఏమో!.
 
మన ‘దారి’.. యమదారి
నగరంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. పట్టుమని పది మీటర్ల మేర రోడ్లు కూడా సవ్యంగా ఉండదు. అస్తవ్యస్తపు రహదారుల వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ట్రాఫిక్ సమస్యా పెరుగుతోంది. గుంతల రోడ్లతో వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. ఏడువేల కిలోమీటర్ల రహదారుల్లో వీఐపీల ప్రాంతాల్లోవి తప్పస్తే అన్నింటా అవస్థలే. అందమైన రోడ్లే నగరాభివృద్ధి ముఖచిత్రంగా నిలుస్తాయి. మరి మన రోడ్ల సమస్య ఎన్నటికి తీరేనో?!.
 
నగరవాసి ఆరోగ్యానికి ‘పొగ’
ఆరోగ్యానికి పొగబెడుతున్న వాయు, శబ్ద కాలుష్యాల నుంచి విముక్తి కల్పించాలని సిటిజన్లు కోరుతున్నారు. గ్రేటర్‌లో నిత్యం రోడ్డెక్కుతోన్న సుమారు 35 లక్షల వాహనాలతో నగర జీవనం పొగచూరుతోంది. అబిడ్స్, పంజగుట్ట, చార్మినార్, జూపార్క్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ధూళిరేణువుల స్థాయి అత్యధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్డెక్కకుండా చేయాలి. ప్రతి వాహనానికి ఏటా కాలుష్య తనిఖీలు నిర్వహించాలి. ఇంధన కల్తీకి అడ్డుకట్ట వేయడంతో పాటు కాలుష్యకారక బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలను ఔటర్ రింగురోడ్డు ఆవలకు తరలించాలి.
 
మంచినీళ్లే మహా ప్రసాదం
గ్రేటర్‌లో నివాస సముదాయాలు 24 లక్షలు. నల్లా కనెక్షన్లు 8.25 లక్షలు మా త్రమే. అంటే మూడో వంతు జనానికే నీళ్లందుతున్నాయి. గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లోని వెయ్యి కాల నీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ లేదు. 35 లక్షల మంది కి నిత్యం ‘పానీ’పట్లు తప్పట్లేదు. ఆయా ప్రాంతాలకు సు మారు రూ.5 వేల కోట్లతో పైప్‌లైన్ వ్యవస్థ, నీటి స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. గోదావరి, కృష్ణా మూ డో దశలను పూర్తిచేస్తేనే అంతోఇంతో సమస్య తీరుతుంది.
 
నగరం ‘మురుగు’తోంది
గ్రేటర్ పరిధిలో డ్రైనేజీ వసతు లు లేని వెయ్యి కాలనీలు, బస్తీ ల్లో నిత్యం రోడ్లపై మురుగునీ రు పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో జనం అవస్థలు పడుతున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాతో డ్రైనేజి వసతులు కల్పిస్తేనే ఈ సమస్య నుంచి జనానికి విముక్తి. డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి గతంలో సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌కు తెలంగాణ నూతన సర్కారు నిధులు విడుదల చేస్తే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.
 
పౌరసేవలు..
ఏ ప్రభుత్వ విభాగంలో సేవలు పొందాలన్నా కాళ్లరిగేలా తిరగాల్సిందే. జనన, మరణ ధ్రువీకరణపత్రాల నుంచి మొదలు పెడితే.. భవన నిర్మాణ అనుమతులు, కుల,  ఆదాయ ధ్రువీకరణ పత్రాల దాకా ఇదే దుస్థితి. చేతులు తడపనిదే పనులు కావట్లేదు. దీన్ని నివారించి వివిధ విభాగాల్లో జవాబుదారీతనం పెర గాలి.
 
అందరి సహకారంతో...

అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లక్ష్యాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉంది. అందులో భాగంగా స్లమ్‌ఫ్రీ సిటీ, గుంతలు లేని రోడ్లు, మెరుగైన పారిశుధ్యం నిర్వహణకు ఇప్పటికే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. అందుకు అందరి సహకా రం కావాలి. అధికారులు, సిబ్బందితో పాటు ప్రజల సహకారంతో వీటిని పూర్తిచేయగలమన్న నమ్మకం ఉంది.               

- సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement