ప్రాజెక్టుల రీ డిజైన్ వెనక భారీ అవినీతి
ఒక్క ఎకరమైనా అదనపు ఆయకట్టు లేకున్నా
అంచనా వ్యయం రూ. 40 వేల కోట్లు పెంపు: ఉత్తమ్
కాంగ్రెస్ అభివృద్ధిని మరిపించే కుట్ర
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై గాంధీభవన్‌లో పార్టీ సమావేశం
పార్టీ నేతల అభిప్రాయాలను క్రోడీకరించేందుకు
కమిటీ వేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్:
దేశంలో ఎన్నడూ లేనంత భారీ అవినీతి, నిధుల దోపిడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకం వేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రతిగా కాంగ్రెస్ తలపెట్టిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు సంబంధించి శనివారం గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జి.వివేక్, దాసోజు శ్రవణ్, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ సీనియర్లు పాల్గొన్నారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఏయే అంశాలుండాలి, అంశాల వారీగా బాధ్యతల విభజన, ప్రజెంటేషన్‌కు తేదీ, స్థలం వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోని లోపాలు, ప్రాజెక్టుల రీ డిజైన్ వెనుక దాగిన కుట్ర, రాష్ట్ర ప్రజలపై పడే భారం, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, దానిని మరిపించే కుట్ర వంటి అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
పార్టీ సీనియర్లు, అనుభవజ్ఞుల సూచనలను, అభిప్రాయాలను క్రోడీకరించడానికి ఒక కమిటీని వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ అవినీతికి పథకం వేసుకున్నారని ఆరోపించారు. తమ్మిడిహెట్టిని నిర్లక్ష్యం చేస్తూ గోదావరి నదిపై దిగువ ప్రాంతం నుంచి నీటిని లిఫ్టుల ద్వారా తీసుకోవాలనే నిర్ణయం వెనుక అవినీతి కుట్ర దాగి ఉందని ఆరోపించారు. లిఫ్టుల నిర్మాణం, నిర్వహణ వంటివి పెనుభారంగా మారుతాయని ఉత్తమ్ చెప్పారు. రీ డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చినా ఒక్క ఎకరమైనా అదనపు ఆయకట్టును ప్రతిపాదించలేదని వివరించారు.
అదనంగా ఆయకట్టు లేకున్నా రూ. 40 వేలకోట్ల అంచనా వ్యయాన్ని ఎలా పెంచుతారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ చేసిన అభివృద్ధిని, కేసీఆర్ ప్రచారంలోని కుట్రలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు రూపకల్పన చేస్తామని వివరించారు. సాంకేతికంగా అనుకూలంగా లేకున్నా కేవలం కమీషన్లకోసం తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. ఈ నెల 14 తర్వాతనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని, మూడు, నాలుగు రోజుల తర్వాత తేదీని ఖరారు చేస్తామని చెప్పారు.