తక్షణమే ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ | kcr orders Special Urdu DSC instantly | Sakshi
Sakshi News home page

తక్షణమే ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ

Published Sun, Jan 22 2017 3:35 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

తక్షణమే ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ - Sakshi

తక్షణమే ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ

ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి తక్షణమే ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
మణికొండలో 40 కోట్లతో ఇస్లామిక్‌ సెంటర్‌ కమ్‌ కన్వెన్షన్‌ హాల్‌
21 కోట్లతో అనీస్‌–ఉల్‌–గుర్బా స్థలంలో ముస్లింల అనాథాశ్రమం
మక్కా మసీదు సమగ్రాభివృద్ధికి రూ. 8.50 కోట్లు
ఇమామ్, మౌజమ్‌ల గౌరవ భృతి రూ. 1,500కు పెంపు
ఉర్దూలో నీట్‌ నిర్వహించాలని ప్రధానికి లేఖ
మైనారిటీల సంక్షేమంపై ముఖ్యమంత్రి నిర్ణయాలు  


సాక్షి, హైదరాబాద్‌
ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి తక్షణమే ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంస్థల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్‌ కేంద్రంతో కూడిన కన్వెన్షన్‌ హాలు నిర్మిస్తామని ప్రకటించారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై శనివారం మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్, ఆ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌తో చర్చించిన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌ మణికొండలోని ఆరు ఎకరాల వక్ఫ్‌ స్థలంలో రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మిస్తామన్నారు. ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఇస్లామిక్‌ సెంటర్‌ ఉపయోగపడాలని, దీనికోసం మంచి డిజైన్లు తయారు చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి శంకుస్థాపన చేస్తానన్నారు.

రూ.21 కోట్లతో ముస్లింల అనాథాశ్రమం
నాంపల్లిలో అనీస్‌–ఉల్‌–గుర్బా స్థలంలో ముస్లింల కోసం అనాథశ్రయం నిర్మించడానికి సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ఫైలుపై శనివారం సంతకం చేశారు. ఇప్పటికే 4 వేల గజాల స్థలాన్ని అనీస్‌–ఉల్‌–గుర్బాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని, త్వరలో శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు.

ఉర్దూలో ‘నీట్‌’పై ప్రధానికి లేఖ...
నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను ఉర్దూలోనూ నిర్వహించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా భారీగా ఉర్దూ మధ్యమంలో చదివే విద్యార్థులున్నారని, వారికి ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించామని, పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం పిల్లలు ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషల్లో నీట్‌ నిర్వహిస్తున్నందున, ఉర్దూ మాధ్యమంలోనూ పరీక్ష నిర్వహించాలని కోరారు.

మరికొన్ని నిర్ణయాలు/ఆదేశాలు...
– హైదరాబాద్‌లోని మక్కా మసీదు సమగ్రాభివృద్ధికి రూ. 8.48 కోట్లు మంజూరు. మక్కా మసీదుకు అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు జరపాలని ఆదేశం.

– రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్, మౌజమ్‌ల గౌరవ భృతిని నెలకు రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్‌ 1) నుంచి పెంచిన భృతి అందించాలని అధికారులకు సూచన.

– ఫలక్‌నుమాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశం. డిగ్రీ కళాశాల నిర్వహణ ఏర్పాట్లకు రూ.10 కోట్లు మంజూరు చేశారు.

– ముస్లింల కోసం ప్రత్యేక ఐటీ సెజ్‌ ఏర్పాటుకు ఆదేశం. అనువైన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచన.

– రాష్ట్రంలోని 17 మైనారిటీ జూనియర్‌ కళాశాలలు, నాలుగు మైనారిటీ డిగ్రీ కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులకు నిధులు మంజూరు చేయాలని ఆదేశం. ఈ విద్యా సంస్థల్లో చదివే విద్యారులు ఫీజు చెల్లించే అవసరం లేకుండా చూడాలని సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement