
జజ్జనకరి జనాలే..
ఎటు చూసినా జనం.. నగరం గులాబీ వనం.. జయజయధ్వానాల ఉత్సాహ గళం.. పూలవర్షమై కురిసిన హర్షం.. హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన కేసీఆర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో జననీరాజనం..
- తెలంగాణ రథసారధికి అపూర్వ స్వాగతం
- అడుగడుగునా గులాబీ దళం నీరాజనం
- బేగంపేట నుంచి గన్‌పార్క్ వరకు భారీర్యాలీ
- బతుకమ్మలు,బోనాలు,కేరింతలు, నృత్యాలతో జననేతకు వెల్‌కం
- ర్యాలీలో ఒంటెలు, ఏనుగులు,గుర్రాలు ప్రత్యేక ఆకర్షణ
- తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన నగరం
ఎటు చూసినా జనం.. నగరం గులాబీ వనం.. జయజయధ్వానాల ఉత్సాహ గళం.. పూలవర్షమై కురిసిన హర్షం.. హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన కేసీఆర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో జననీరాజనం.. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ.. దారి పొడవునా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే కళారూపాలు.. ఒంటెలపై ఊరేగింపులు.. బోనాలు.. బతుకమ్మ ఆటపాటలు.. ఉత్సాహపరిచే డప్పుచప్పుళ్లు.. తెలంగాణ విజయోత్సవ ర్యాలీ సంబరం అంబరాన్నంటింది.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా..తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతా’ అని గతనెల 31న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అన్నట్లుగానే..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అడుగుపెట్టిండు. ఉభయసభల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఆమోదం అనంతరం తొలిసారి బుధ వారం నగరానికి చేరుకున్న తెలంగాణ రథసారధికి అపూర్వస్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం, తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా తరలిరావడంతో నగరం తెలంగాణ నినాదాలతో మార్మోగిపోయింది. ఉద్యమనేత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గన్‌పార్కుకు చేరుకుందిలా..
బుధవారం సాయంత్రం 4గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్..అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
హరీష్‌రావు,కవిత, పార్టీ అగ్రనేతలు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం వద్ద ఆయన్ను ఆశీర్వదిస్తూ వివిధ మతాల పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు.
పెద్దసంఖ్యలో మహిళలు మంగళహారతులు,బతుకమ్మలు,బోనాలతో జైకేసీఆర్ అంటూ స్వాగతం చెప్పారు.
జయజయధ్వానాల మధ్య బే గంపేట ఎయిర్‌పోర్టు నుంచి అశేషజనవాహిని తోడురాగా కేసీఆర్ ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రచార రథంపై ఎంపీలు కేశవరావు,వివేక్,మందా జగన్నాథం,పార్టీ నేతలు ఈటెల రాజేందర్,నాయినిలతో కలిసి ప్రయాణించారు.
అడుగడుగునా విజయచిహ్నాన్ని చూపుతూ,కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదిలారు.
ర్యాలీలో ఆయనకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. పార్టీశ్రేణులు బేగంపేట నుంచి గన్‌పార్క్ మార్గంలో ఏర్పాటుచేసిన బ్యానర్లు,ఫ్లెక్సీలు,గులాబీ తోరణాలతో నగరం గులాబీవనంగా మారింది.
పలు ప్రధానకూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన స్వాగత వేదికల వద్ద తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన ధూంధాం నృత్యరూపకాలు ఉత్సాహం నింపాయి.
టీఆర్‌ఎస్ జెండాలు చేతబూని ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, ద్విచక్రవాహనాలపై ముందుకు సాగుతూ పలువురు కార్యకర్తలు ర్యాలీలో ప్రధానాకర్షణగా నిలిచారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్ల నుంచి దారిపొడవునా పూలవర్షం కురిపించి కేసీఆర్‌కు హార్థిక స్వాగతం పలికారు. మధ్యమధ్యలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ,రంగులు చల్లుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
బేగంపేట,సీఎం క్యాంపుకార్యాలయం,గ్రీన్‌ల్యాండ్స్,పంజగుట్ట,సోమాజిగూడా, ఖైరతాబాద్,లక్డీకాపూల్,రవీంద్రభారతి మీదుగా సాగిన ర్యాలీ గన్‌పార్కుకు చేరుకుంది.
అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేకరాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులకు కేసీఆర్, పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
దారిపొడువునా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలతో పహారాకాశారు.
అడుగడుగునా నీరాజనమే
4:50 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి బయటకొచ్చిన కేసీఆర్‌కు జై తెలంగాణ, జైకేసీఆర్ నినాదాలతో స్వాగతం పలికారు. దారిపొడువునా పార్టీ కార్యకర్తలు డప్పువాయిద్యాలు, లంబాడ నృత్యాలు, తెలంగాణపాటలతో హోరెత్తించారు. తెలంగాణతల్లి సహా పలురకాల వేషధారణలు, గుర్రాలు, ఒంటెలతో స్వాగత ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులు, తెలంగాణవాదులరాకతో బేగంపేట విమాశ్రయ పరిసరాలు కిక్కిరిసాయి.
జనపార్కు
భారీర్యాలీ నడుమ రాత్రి 9.15 గంటల ప్రాంతంలో కేసీఆర్ గన్‌పార్క్‌కు చేరుకోగానే జెతైలంగాణ నినాదాలు హోరెత్తాయి. వేలాదిగా తరలివచ్చిన తెలంగాణావాదులతో అసెంబ్లీ,రవీంద్రభారతి పరిసరాలు ఇసుకవేస్తే రాలనంతగా మారాయి. భారీ జనసందోహం నడుమ కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని వారి త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
భారీ తెరల ఏర్పాటు
ఆయా ప్రాంతాల నుంచి గన్‌పార్కుకు చేరుకున్న వారు కేసీఆర్ నివాళులర్పించే ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా పెద్దపెద్ద తెరలను ఏర్పాటు చేశారు. అనేకమంది వీటిద్వారానే విజయోత్సవ ర్యాలీ,అమరవీరులకు నివాళి దృశ్యాలను వీక్షించారు. నివాళులర్పించే సమయంలో ఆకాశం నుంచి హెలికాప్టర్లలో పూలవర్షం కురిపించారు. ఆసందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు,డప్పునృత్యాలు,ఆటలు,అమరులను కీర్తిస్తూ పాడిన పాటలు హోరెత్తించాయి.