సాక్షి, సిద్దిపేట: ఎవరైనా చెట్ల ఆకులు తెంపి విస్తార్లు కుడతారు.. అందులో వడ్డన చేస్తారు. కానీ బీజేపీ నేతల మాట చూస్తే చెట్టుపై ఉన్న ఆకులనే విస్తర్లు కుట్టి వడ్డిస్తామని అంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా కన్పించని బీజేపీ నాయకులు.. మళ్లీ ఎన్నికలు అనగానే వస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు మేలు చేస్తానని తరచుగా చెప్పే బీజేపీ నాయకులు.. రైతుల సంక్షేమానికి తూట్లు పొడిచే బిల్లును ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏది అవసరమో గుర్తించి వాటికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు లాంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నోరుంది కదా అని మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం రూ. 2,500 కోట్లు ఇస్తామని చెప్పిందని, రైతుల క్షేమమే ముఖ్యమని భావించి ఆ ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయం దండగ అన్నాడని, రైతులకు వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌కు మీటర్లు పెడతానని చెప్పిన విషయం మంత్రి గుర్తు చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారెవరు మనుగడ సాధించలేరని అందుకోసమే మీటర్లు పెడతామన్న చంద్రబాబును ప్రజలే ఇంటికి సాగనంపారని చెప్పారు.. అభివృద్ధిని చూడాలి. అభివృద్ధి చేసిన నాయకుడిని చూడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment