
సిటీ గజగజ
మహానగరం బుధవారం నిలువెల్లా వణికిపోయింది. శీతాకాలంలో కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతల వల్ల కాదు సుమా..! తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వరుసగా గంట గంటకూ వెలుగులోకి వచ్చిన నేరాలు, ఘోరాల కారణంగానే. రెండు హత్యలు, మరో రెండు ప్రమాదాల్లో ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోగా.. ఓ యువతిపై ఘాతుకం చోటు చేసుకుంది. రాష్ట్రం వెలుపలా నగరవాసులు బాధితులుగా మారారు. వీటికి తోడు ‘తనిష్క్’ కేసు నుంచి చెంచులక్షి వరకు ఘరానా దొంగలు కూడా అరెస్టయ్యారు. ఇవన్నీ నగరజీవికి షాక్ ఇవ్వగా, సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన ‘బంక్ స్కామ్’ సిటిజనుల్ని అవాక్కయ్యేలా చేసింది. ఈ ఉదంతాలకు సంబంధించిన ‘క్రైమ్ టైమ్’ ఇలా ఉంది..
ఘరానా దొంగ అరెస్ట్
మల్లేపల్లి మాన్గార్ బస్తీకి చెం దిన ఘరానా దొంగ చెంచులక్ష్మి, తన సోదరుడు లక్ష్మణ్‌తో కలిసి మరోసారి పట్టుబడింది. ఈసారి నాలుగు చోరీలకు సంబంధించి 11 తులాల సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు.
హైటెక్ మోసం
హైటెక్ పరిజ్ఞానంతో పెట్రోల్ బంకుల్ని వేదికగా చేసుకుని ఏళ్లుగా వ్యవస్థీకృత మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసి, ఏడు బంకుల్ని సీజ్ చేశారు.
తనిష్క్ కేసు కొలిక్కి
పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీకి ఒడిగట్టిన నిందితుల్లో రెండోవాడు ఆనంద్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇతడినుంచి 720 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బాలుడి హత్య
జాలీ హనుమాన్ నివసించే అనిల్‌కుమార్ కుమారుడు యష్ కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు చేయగా బాలుడి సమీప బంధువే దారుణంగా చంపినట్లు తేలింది.
రౌడీషీటర్ హతం
రౌడీషీటర్, ఉస్మాన్‌పురవాసి అబ్దుల్ కరీం దారుణ హత్యకు గురయ్యాడు. హతుడి ఒంటిపై 20 కత్తిపోట్లు ఉండటంతో పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
రైల్లో భారీ చోరీ
సికింద్రాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో దొం గలు పడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ భారీ చోరీలో సిటీకి చెందిన పలువురు రూ.15 లక్షలకు పైగా విలువైన సొత్తును కోల్పోయారు.
బలిగొన్న ట్రాక్టర్
ఓ కుటుంబాన్ని కూలీ కోసం రహేజా మైండ్ స్పేస్ నుంచి తరలి స్తున్న ట్రాక్టర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద పల్టీ కొట్టడంతో అత్తాకోడళ్లు సోమమ్మ, రేణుక చనిపోయారు.
లైంగిక దాడి
చిలకలగూడ చింతబావికి చెందిన యువతిపై రైల్వేక్వార్టర్స్‌లో నలుగురు యువకులు లైంగికదాడికి యత్నించి, కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది.
కూలీల దుర్మరణం
షేక్‌పేట్ నాలాలోని ఆర్చియాన్ వరల్డ్ ఆఫ్ మార్బుల్స్‌లో రాజ స్థాన్ నుంచి వచ్చిన భారీ మార్బుల్స్‌ను దించే క్రమంలో ప్రమాదానికి గురై కూలీలు సురేందర్ సహనీ, అజయ్ సహనీ కన్నుమూశారు.