క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్: కిషన్‌రెడ్డి
కాచిగూడ (హైదరాబాద్ సిటీ) : బాలబాలికలకు సహజంగానే సహనం, ఓర్పు ఉంటాయని, ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రీడల్లో రాణించాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ నారాయణగూడ బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ వార్షిక వైఎంసీఏ కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ - 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని వివిధ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డి, చెస్, త్రోబాల్, కరాటే తదితర పోటీలలో వందల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చాటనున్నారు.
అనంతరం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు, మామూలు విద్యార్థులకు చాలా వ్యత్యాసాలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో స్నేహ పరిచయాలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఛైర్మన్ ఫిలమెన్ రాజ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీజే వినయ్‌స్వరూప్, కోశాధికారి మార్యో, సీనియర్ కార్యదర్శి కిరణ్‌కుమార్, విజయలక్ష్మీ, బీజేపీ నేతలు ఏ.సూర్యప్రకాష్ సింగ్, జి.సోమేశ్వర్, బిఆర్ రవి తదితులు పాల్గొన్నారు.