‘రైతులకు అండగా జేఏసీ ఉంటుంది’
Published Wed, May 31 2017 4:32 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
హైదరాబాద్: స్వచ్చంద భూసేకరణ ద్వారా రైతులు ఒప్పుకుంటే భూములు తీసుకోవచ్చు.. కానీ ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. రైతు ఆమోదం లేకుండా బలవంతపు భూసేకరణ చేయరాదని, సామజిక వర్గాల వారికే అసైన్డ్ భూములు ఉన్నాయని, కానీ ప్రభుత్వం దీనికి విరుద్దంగా వాటిని లాక్కోవాలని చూస్తుందన్నారు. కొత్త చట్టం వస్తుందని భయపడనవసరం లేదని మీకు అండగా జేఏసీ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే అడ్వకేట్‌లు కూడా అండగా ఉంటారని అన్నారు. భూసేకరణ చట్టం- 2016 రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత రైతులు ఒప్పుకుంటే ఇస్తున్నారు.. ఇవ్వకపోతే కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా రైతులను బెదిరించి భూములను తీసుకుంటున్నారని అన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వారికి ఇష్టం ఉంటేనే భూములను తీసుకోవాలని సూచించారు. బలవంతపు భూసేకరణపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా చిన్న రైతులు.. రెండు మూడు ఎకరాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలలో 10 లక్షల ఎకరాల భూమి బలవంతగా లాక్కుంటున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మియాపూర్ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిలో రిజిస్టర్ పైఅధికారుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Advertisement