హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే ఆయనను కలసినట్లు ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను హరీష్ రావు సందర్శించారని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పినట్లు చెప్పారు. టీఆర్ఎస్లో చేరతారా ? అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు... టీఆర్ఎస్లో చేరతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అని విలేకర్లు ప్రశ్నించగా... ఈ అంశంపై నో కామెంట్ అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జవాబు దాటి వేశారు.