జానారెడ్డి చేస్తే ఒప్పు... నేను చేస్తే తప్పా?
టీపీసీసీ షోకాజ్ నోటీసుపై స్పందించిన అధికార ప్రతినిధి కృష్ణమోహన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మెచ్చుకుంటే లేని తప్పు, విజ్ఞతతో ఒక వ్యాసం రాస్తేనే వచ్చిందా అని టీపీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రశ్నించారు. టీపీసీసీ ఇచ్చిన షోకా జ్ నోటీసుకు సమాధానం ఇస్తూ శుక్రవారం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 5 రూపాయల భోజన పథకం బాగుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు జానారెడ్డి పొగిడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని కృష్ణమోహన్ ప్రశ్నించారు.
అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అనుచితంగా మాట్లాడినా ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని నిలదీశారు. దానంపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యేలకు షోకాజు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. పార్టీ కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న తనకు షోకాజును ఇవ్వడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ముందుగా నోటీసును తనకు పంపకుండా మీడియాకు విడుదల చేసి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.