ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం
నల్లగొండ: ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన పార్టీ సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం మూలస్తంభమని.. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య మనుగడ కష్టసాధ్యమని కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం అధికార అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ప్రజాప్రతినిధులను పశువులుగా కొనుగోలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ విషపూరిత రాజకీయాలకు పాల్పడితే మాత్రం ప్రతిపక్ష పార్టీ హోదాలో ఏం చేయాలో అది చేసి తీరుతామని హెచ్చరించారు. ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సీఎంగా జానారెడ్డి కావడ ం ఖాయమన్నారు.
బెదిరింపులకు పాల్పడుతోంది: ఉత్తమ్
12 ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తప్ప అన్ని జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పారీ బెదిరింపులు, లాలూచీ ధోరణులు, అణచివేత విధానాలతో వ్యవహారిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో చెడు సంప్రదాయాలకు ఆజ్యం పోసిందన్నారు. నల్లగొండ జిల్లాకు సంబంధించినంత వరకు వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు సంప్రదింపులు చేస్తున్నామని.. మిగిలిన జిల్లాల్లో కూడా దశల వారీగా వివిధ పార్టీలతో చర్చిస్తామని చెప్పారు.