లోకేశ్ కు కేటీఆర్ కౌంటర్
- అమరావతికి తట్టెడు మట్టి...లొట్టెడు నీళ్లు...
-హైదరాబాద్‌కు కాదు...అమరావతికి నిధులు తెచ్చుకోండి...
-నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే దమ్ము కేసీఆర్‌కే ఉంది....
-గాడిదలకు గడ్డివేసి...ఆవులను పాలు ఇమ్మంటే ఇస్తాయా?
-హైదర్‌నగర్ అభ్యర్ధిని గెలిపిస్తే దత్తత తీసుకుంటా....
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీయివ్వడాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తట్టెడు మట్టి...లొట్టెడు నీళ్లను మాత్రమే తెచ్చారని, హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి ఆలోచించే బదులు అమరావతి నగర అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలని లోకేశ్ కు కేటీఆర్ చురకలంటించారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దే దమ్ము, ధైర్యం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గాడిదలకు గడ్డివేసి...ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా? అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ని కాదని ఇతరులకు ఓటువేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటదన్నారు.
బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటువేస్తే ఎలాంటి ఉపయోగం లేదని, సమస్యల పరిస్కారానికి, సమగ్ర అభివృద్ధికి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటువేయాలని కోరారు. 1100 కోట్ల రూపాయలతో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి జానకి రామరాజును గెలిపిస్తే.. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తాగు నీటి సమస్యపై స్థానికులు ప్రశ్నించగా.. త్వరలోనే అందరికీ ప్రతిరోజు నీళ్లు వస్తాయన్నారు.
దమ్ముంటే రాజీనామా చేస్తావా?
తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచిన15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. నగరంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు అడ్డగోలుగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. హైదర్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్‌తో పాటు పాల్గొన్న కృష్ణారావు టీడీపీ నేతల తీరును ఎండగట్టారు.