‘హోదా’పై మహానాడులో తీర్మానం చేయండి
సీఎం చంద్రబాబుకు ఎంపీ కేవీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తుకంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ముఖ్యమనేలా మహానాడులో తీర్మానాన్ని ఆమోదించాలని సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బుధవారం లేఖ రాశారు. మీ చతురత, ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థతను మీకోసం, మీ మనుషుల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం వాడాలన్నారు. లేఖలోని అంశాలివీ.. ‘ఈనెల 27 నుంచి జరిగే టీడీపీ మహానాడులో చేయనున్న తీర్మానాలు, పత్రికల్లో లీకైనవి చదివాను.. ప్రత్యేక హోదా అమలుకు ప్రతిపాదన కనిపించలేదు. రెండేళ్లయినా విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కాదా? ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో నేను ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్‌కు రాకుండా ఉభయసభలూ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం మీకు తెలుసు.
రానున్న సమావేశాల్లోనైనా ఈ బిల్లు ఓటింగ్‌కు వస్తుందని ఆశిస్తున్నాను. ఈలోగా ఏపీకి చెందిన అన్ని పార్టీలూ ఒక్క తాటిపైకి రావాల్సిన అనివార్యతను మీ దృష్టికి తెస్తున్నా. మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలం? వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌లతో ఎలా కలసి పని చేయగలం? అనే భేషజాలకు తావివ్వకుండా, విభజన హామీల అమలుకు అంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని పక్షాలతో ‘పరస్పర దూషణ విరమణ’ ఒప్పందం చేసుకోవాలి.’ అని లేఖలో కేవీపీ పేర్కొన్నారు.