చిత్తశుద్ధి ఉంటే ఉద్యమించాలి
♦ ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు అంబటి సవాల్
♦ రాష్ర్ట ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆంధప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్కించడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ హామీ ఇచ్చి మోసం చేయడం తగునా? అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇది తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ లబ్ధి, స్వలాభం కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని హితవు పలికారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత చంద్రబాబుకి లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా లేకపోతే చీలిపోయిన రాష్ట్రం అధోగతి పాలవుతోందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాష్ట్రానికి కొత్త ఊపిరి అందిస్తుందన్నారు.
కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గుచేటు
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ బీజేపీ కుండబద్దలు కొట్టినా బీజేపీని విమర్శించొద్దంటూ చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమని అంబటి మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు మంత్రివర్గంలో కొనసాగుతున్నంత కాలం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏం వినిపించదని.. ఇంకా కేంద్రం మంత్రివర్గంలో ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చిట్టా మోదీ, కేసీఆర్ వద్ద ఉందని అందుకే ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ తల్లిని చంపేస్తే.. బీజేపీ 20 నెలల బిడ్డను చంపేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుంటే.. నీళ్ల కోసం రైతులే ఢిల్లీ వెళ్లి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసుకునే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. భయాన్ని వీడి ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమతో కలసి రావాలని చంద్రబాబుకు సూచించారు.
పెద్ద ఎత్తున మద్దతు పలకండి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేకహోదా సాధనకోసం ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తమ పార్టీ ముందే ప్రకటించిందని అంబటి రాంబాబు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.