
మద్యం మహమ్మారిపై పోరు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం మహమ్మారిపై ఉద్యమించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లను అర్ధరాత్రి వరకు అనుమతించడంతో బెల్ట్‌షాపులు గ్రామీణ జనజీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ధ్వజమెత్తింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 వేల కోట్ల మేర బడుగు, బలహీన వర్గాల కష్టార్జితాన్ని మద్యం మాఫియా-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొల్లగొడుతున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
ప్రభుత్వం ఆబ్కారీ ఆదాయంపైనే దృష్టి పెట్టడం ప్రజాద్రోహమన్నారు. తాగుడు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల రమ్య వంటి పసి మొగ్గలు రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సమాజాన్ని తట్టిలేపడానికి, మద్యపాన నియంత్రణకు ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి 12న ఉదయం 10 గంటల వరకు నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయం ఎదుట బీజేపీ నేత ప్రొ.ఎస్వీ శేషగిరిరావు నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఉద్యమానికి ఇది ఆరంభమేనని.. ఈ సాంఘిక దురాచార నిర్మూలనోద్యమానికి ప్రజలందరూ మద్దతివ్వాలని లక్ష్మణ్ కోరారు.
సైనికుల గురించి మాట్లాడే అర్హత లేదు
దేశ సైనికుల గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సైనికోద్యోగి రామ్‌కిషన్ గ్రోవర్ కుటుంబాన్ని పరామర్శించే నైతికహక్కు రాహుల్‌కు లేదన్నారు. సర్జికల్ దాడుల ఆధారాలు చూపాలంటూ రాహుల్‌గాంధీ మాట్లాడడం సిగ్గు చేటని.. సైనికులను అవమానపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రధాని మోదీని, కేంద్రాన్ని టీపీసీసీ నేత ఉత్తమ్ విమర్శించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.