
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణకు భారీగానే నిధులు ఇస్తోందని, అయితే రాష్ట్రం సకాలంలో వినియోగించుకోకపోవడం వల్ల అదనపు నిధులు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పారు. 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్యం అందించాలన్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు.
బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలపై కేంద్రానికి పలుమార్లు నివేదికలు ఇచ్చినప్పటికీ బడ్జెట్‌లో ఎలాంటి పథకాలు మంజూరు చేయకపోవడం బాధ కలిగించిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను చూస్తే బీసీలను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో బీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.
‘బడ్జెట్‌లో బీసీల ప్రస్తావనే లేదు’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వెనుకబడిన తరగతులకు నిరాశ మిగిల్చిందని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అతితక్కువ నిధులు కేటాయించడంతో బీసీలపై కేంద్రానికి ఉన్న శ్రద్ధ ఏమిటో స్పష్టమైందని పేర్కొంది. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగంలో బీసీల ప్రస్తావనే లేకపోవడం పట్ల ఆ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బీసీ బడ్జెట్‌పై ఉద్యమించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
ఎప్ట్యాప్సీ అధ్యక్షుడు గౌరా శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఇది పారిశ్రామిక వర్గాలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేని బడ్జెట్ అని ఎప్ట్యాప్సీ అధ్యక్షుడు గౌరా శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, ఏపీలను బడ్జెట్లో విస్మరించారని, కొంత వరకు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేలు కలిగించేదిగా ఉన్నా, పారిశ్రామిక వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, ఆహారోత్పత్తి సంస్థలు, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రోత్సాహాన్ని అందించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు జరిపిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment