
అవిశ్వాస నోటీసుపై చర్చకు ఆమోదం
ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస నోటీసుకు ఆమోదం లభించింది. సభలో ఉన్న మొత్తం సభ్యులలో 10 శాతం మంది కంటే ఎక్కువ మంది దీనికి మద్దతు పలకడంతో చర్చను చేపట్టనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ అంశంపై బీఏసీలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. సభను టీ విరామం కోసం 10 నిమిషాలు వాయిదా వేస్తున్నామని, తర్వాత బీఏసీలో చర్చిస్తామని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎప్పుడు చేపట్టాలి, ఎంత సేపు దానిపై చర్చించాలన్న విషయాలను బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోపు ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉంది.
గత 22 నెలల కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను అధికార పక్షం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటున్నారు. తాము ప్రజాసమస్యల మీద పోరాడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం తాము అవినీతితో సంపాదించిన సొమ్ముతో మరింత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లువుతున్నా, ఏ వర్గానికి చెందిన ప్రజలకూ ఏమీ చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు.