
చేద్దాం రన్‌డి.. raahgiri
బాల్యంలో ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆడిన గిల్లీదండా గుర్తుందా?.. గల్లీ క్రికెట్‌లో చిచ్చర పిడుగులా రెచ్చిపోయిన రోజులు గుర్తున్నాయా ?.. అయితే, కొద్దిసేపు ఇంటికి తాళం వేయండి. షి‘కార్లు’ కట్టిపెట్టండి. బైక్‌ల స్పీడ్‌కు బ్రేక్‌లు వేయండి. నేరుగా మైండ్‌స్పేస్ జంక్షన్‌కు ‘రన్’డి. అక్కడ.. నో వెహికల్స్.. నో హార్న్స్.. నో పొల్యూషన్.. నాలుగు గంటల పాటు ఓన్లీ సెలబ్రేషన్స్.
నచ్చిన పాట పాడుకోండి. వచ్చిన డ్యాన్స్ చేయండి. అలుపొచ్చే వరకు పరుగెత్తండి. రోడ్లపై దర్జాగా నడవండి. నడపడంలో బై‘స్కిల్’ చూపండి. అలసిపోయేలా ఆసనాలు వేయండి. మ్యూజిక్ వింటూ జాగింగ్.. యాహూ అంటూ స్కేటింగ్.. క్రికెట్, ఫుట్‌బాల్, స్టేజ్ షో.. అదీ ఇదీ అని కాదు.. మీకొచ్చిన ‘కళ’ను ప్రదర్శించండి. టోటల్‌గా ‘రాహ్‌గిరి’ చేయండి.
..:: సీహెచ్.ఎమ్.నాయుడు
పాదచారే రహదారికి హీరో.. కానీ,
రోడ్డెక్కితే అతను జీరో. కనీసం నిల్చునే చోటుండదు. సైక్లిస్ట్ పర్యావరణ మిత్రుడు.. కానీ, ట్రాఫిక్ రణంలో సైకిల్ దూసుకుపోలేదు. కార్లున్న వారివే సిటీ రహ‘దారులు’. ఇక్కడ పాదచారులకు నడవ చోటుండదు. ఆకాశాన్నంటే హార్మ్యాలు, గల్లీ నుంచి మెయిన్‌రోడ్ వరకూ పేరుకుపోయిన కార్లు.. ఇవే నగరానికి కొలమానం కావు. ‘రాజధానిలోని వీధి వీధి నగర వాసులందరివీ. కేవలం మోటార్ వాహనాలు నడిపేందుకే ఇవి లేవు. కనీసం వారానికోరోజు వాహనాలను పక్కన పడేద్దాం. రోడ్లపైకి వచ్చి అందరం ఆడుతూ పాడుతూ గడుపుదాం. ‘బ్రాండ్ హైదరాబాద్’ ఇమేజ్ పెంచడానికి ఏజ్‌తో పనిలేకుండా అందరం కలిసి గ్రాండ్ అంబాసిడర్లు అవుదాం’ అంటోంది ‘రాహ్‌గిరి’.
యూనిక్ కాన్సెప్ట్..
సైక్లింగ్, పాదచారుల భద్రత కోసం కొలంబియాలోని బొగొటా నగరంలో ‘సైక్లోవియా’ పేరుతో ఓ ఉద్యమం మొదలైంది. ఏదైనా ప్రాంతంలోని రోడ్లపై ప్రతి ఆదివారం నిర్దేశిత సమయంలో మోటారు వాహనాల్ని అనుమతించరు. పాదచారులు, సైక్లిస్టులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్, వాకింగ్, స్కేటింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ స్వేచ్ఛగా గడుపుతారు. 70లలో మొదలైన ఈ ఈవెంట్ ప్రస్తుతం 120 కిలోమీటర్ల మేర ‘ఆటోమొబైల్ ఫ్రీ స్ట్రీట్స్’గా రూపాంతరం చెందింది.
ఎల్లలు దాటిన ఈ యూనిక్ కాన్సెప్ట్ పలు అంతర్జాతీయ నగరాలను పలకరిస్తూ ఇండియాలో ‘రాహ్‌గిరి’గా రోడ్డెక్కింది. ‘ఈ వీధి మాదిరా.. ఈ రోడ్డు మాదిరా’ అంటూ గుర్గావ్‌లో 2013 నవంబర్‌లో మొదలైన ఈ కమ్యూనిటీ మూవ్‌మెంట్ తర్వాత దిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ నగరాలను చేరుకుంది. ముంబైలో ఇది ‘ఈక్వల్ స్ట్రీట్స్’ పేరుతో నడుస్తోంది. ప్రస్తుతం సౌతిండియాలో తొలిసారిగా హైదరాబాద్‌లో రాహ్‌గిరి ఎంటరైంది. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ క్యాంపెయిన్‌లో భాగంగా దీనిని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ పోలీస్, టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) తోపాటు, ఎంబార్క్ ఇండియా వంటి ఎన్‌జీఓ ఆర్గనైజేషన్లు నిర్వహిస్తున్నాయి.
వాకింగ్ స్వాతంత్య్రం..
నగరంలో 42 శాతం మంది సైక్లిస్టులు, పాదచారులు ఉన్నారు. 27 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నారు. 22 శాతం మంది కార్లు వాడుతున్నారు.. మిగతా వారు వివిధ రవాణా సాధనాలను వినియోగిస్తున్నారు. ఇవీ అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం లెక్కలు. ఒక్క కారు సుమారు 60 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది.
ఈ లెక్కన 22 శాతం మంది వినియోగిస్తున్న కార్లతోనే సిటీలోని రోడ్లు నిండిపోతున్నాయి.‘ఒక పాదచారి నిల్చోడానికి మూడు చదరపు అడుగుల చోటు చాలు. సైక్లిస్ట్‌లు, పాదచారుల నిష్పత్తి ఎక్కువున్నా.. రోడ్డుపై వారికి అడుగు మోపేంత స్థలమైనా లేదు. నగరంలో కనీస స్థాయిలో ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు లేవు. వాటిని కల్పిస్తేనే అందరికీ రోడ్ల స్వాతంత్య్రం దక్కినట్టు’ అని అంటారు ప్రశాంత్‌కుమార్. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ నిపుణులైన ఈయన.. ‘అలాగని ఇది కార్లకు వ్యతిరేకం కాదు. రోడ్లు, వీధులు పబ్లిక్ ప్రాపర్టీస్. ఎవరు ఎంత రోడ్డు వినియోగించుకుంటారో వారికి అంత ప్లేస్ ఇవ్వాలి. రాహ్‌గిరి ఉద్దేశాల్లో ఇదీ ఒకట ’ని చెబుతారు.
అప్నీ రాస్తా.. అప్నీ ఆజాదీ..
సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, వాకింగ్, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయడం మాత్రమే రాహ్‌గిరి లక్ష్యాలు కాదు. దీని ప్రధాన ఉద్దేశం ఈ కమ్యూనిటీ ఈవెంట్ ద్వారా వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఏకం చేయడమే. ఈ ఆదివారం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ కాంప్లెక్స్ వరకు 1.2 కిలోమీటర్ల మేర నగరవాసులు రాహ్‌గిరి చేయవచ్చు.
ఆధునిక జీవనశైలిలో ఉనికి కోల్పోతున్న ఫిజికల్ యాక్టివిటీస్‌ను పునరుత్తేజపరచే విధంగా ఈవెంట్ డిజైన్ చేశారు. అంతేకాదు ప్రజల్లో సామాజిక స్పృహ పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణకు ఇది వేదికగా ఉంటుందంటున్నారు నిర్వాహకులు. ఇంకా చెప్పాలంటే ‘రోడ్లు ఏ కొందరికో, కార్లకో చెందవు. రోడ్లపై కార్లకే కాదు.. సామాన్యులకూ చోటుండాలి. అవి అందరివీ. అప్నీ రాస్తా.. అప్నీ ఆజాదీ..’ అనే కాన్సెప్ట్‌ను విస్తృత పరచడమే లక్ష్యంగా రాహ్‌గిరి సాగనుంది.
అందరి ‘ఫన్’డుగ.. రేపే
ఆదివారం జరగనున్న రాహ్‌గిరీలో రీబక్ గ్రూప్ జుంబా డ్యాన్స్, ఫిట్‌నెస్ శిబిరాలను కండక్ట్ చేస్తోంది. ఏడీఎఫ్‌ఐ- పిల్లలకు సైక్లింగ్‌పై అవగాహన కలిగిస్తోంది. కోకాకోలా- గల్లీ ఫుట్‌బాల్ నిర్వహిస్తోంది. ఐడెంసిటీ గ్రూప్ కల్చరల్ ఈవెంట్స్ పెడుతోంది. ఆక్టోపస్ థియేటర్ గ్రూప్ స్టేజ్ షోలు ప్రదర్శించనుంది.
ఇక, టీఏఎఫ్ సంస్థ.. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన వారిలో ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వంద సైకిళ్లను ఉచితంగా అందచేయనుంది. ఇంకా ఎవరికి వారు సొంత ఈవెంట్లను ప్రదర్శించవచ్చు. యోగా, జిమ్, ఎక్సర్‌సైజ్‌లు, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, ఫన్.. అన్నిటికి మించి ప్రజల్లో టుగెదర్‌నెస్ పెంచే ఈ కమ్యూనిటీ ఈవెంట్‌కు నగరవాసులు రెడీ అవుతున్నారు.
చిన్ననాడు వీధుల్లో మరచిపోయిన బాల్యాన్ని.. మళ్లీ రీక్లెయిమ్ చేద్దామంటూ నిమిషం నిడివి గల రాహ్‌గిరి థీమ్ ఆడియో సాంగ్ సిటీలో హల్‌చల్ చేస్తోంది. ఇక సోషల్‌సైట ్లలో రాహ్‌గిరి కబుర్లు సెకను సెకనుకు వందలాది మందికి చేరుతున్నాయి. టాలీవుడ్ డెరైక్టర్ రాజమౌళి తన సపోర్ట్ ఇప్పటికే ప్రకటించగా, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. ‘నేను సైతం’ అంటూ పిలుపునిచ్చాడు. ‘రాహ్‌గిరి వంటి ఈవెంట్లు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతాయి. హైదరాబాదీలంతా ఇందులో పాల్గొనాలి’ అని టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ కోరారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ఈవెంట్ జరగనుంది.
రోడ్లు, వీధులు అందరివీ..
నగరంలోని 15 శాతం రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణల్లో ఉన్నాయి. ఉన్న రోడ్లను మోటారు వాహనాలు మింగేస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ రోడ్ల వెడల్పు ప్రతిపాదన తెరపైకి వస్తుంది. అన్నిటికీ రోడ్ల విస్తరణ అనేది పరిష్కారం కాదు. కొత్తగా రోడ్లు విస్తరిస్తే మరిన్ని వాహనాలు రోడ్డెక్కుతాయి. అంటే రోడ్డు ఉంది కాబట్టే ఇష్టానుసారంగా వాడుతున్నాం.
అసలు లేకుంటే.. మన భారతీయ
టౌన్‌ప్లానర్లు, ఆర్కిటెక్ట్ నిపుణుల ఈ యోచన నుంచే ‘రాహ్‌గిరి’ మూవ్‌మెంట్ పుట్టింది. రోడ్డు పూర్తిగా సైక్లింగ్ ఫ్రెండ్లీగా ఉండాలి. పాదచారులు హాయిగా నడవగలగాలి. అందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూర్చాలి. బైస్కిల్ షేరింగ్ స్కీమ్స్ వంటివి అమలు చేయాలి. ప్రజల్లో ఈ అవగాహన కలిగించడానికి రాహ్‌గిరి మూవ్‌మెంట్ దోహదం చేస్తుంది.
- ప్రశాంత్‌కుమార్ బచ్చు, ప్రజా రవాణా వ్యవస్థ నిపుణులు, ఎంబార్క్
ట్రాఫిక్ అవేర్‌నెస్
రాహ్‌గిరికి అన్ని విధాలా సహకరిస్తున్నాం. నిర్దేశించిన ప్రాంతంలో 1.2 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు ఉండవు. టీఎస్‌ఐఐసీ నిర్వహించే ఈ కార్యక్రమంలో మా వంతుగా ప్రజల్లో ట్రాఫిక్, రోడ్ల స్థితిగతులు, నిబంధనలు తెలియచెప్పడానికి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాం.
- అవినాశ్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ