ఖేల్ రాస్తా | khel rasta | Sakshi
Sakshi News home page

ఖేల్ రాస్తా

Published Mon, Jan 19 2015 12:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

ఖేల్ రాస్తా - Sakshi

ఖేల్ రాస్తా

నచ్చినవన్నీ ఆడేసి... మెచ్చినవన్నీ చేసేసి... రహదారిలో వినోదాల విందును ఆస్వాదించారు నగరవాసులు. ‘ఆరోగ్యకర జీవనం కోసం ఒక రోజు కార్లు, ఇతర మోటారు వాహనాలను పక్కన పెడదాం. సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీస్‌తో ఎంజాయ్ చేద్దాం’ అనే కాన్సెప్ట్‌తో ఆదివారం మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయో డైవర్సిటీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన  ‘రాహ్‌గిరి’లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉదయం 6.30 నుంచి 10.30 వరకు హాలీడే మూడ్‌ను పూర్తిగా రోడ్డుపైకి తెచ్చేశారు. గల్లీ క్రికెట్, ఫుట్‌బాల్, జుంబా డ్యాన్స్, సైక్లింగ్, స్కేటింగ్ వంటి ఆటలతో వాహనాలు లేని రహదారిపై చిన్నాపెద్దా ఉల్లాసంగా ఆడిపాడారు. 1.2 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఒక పక్క నాలుగు గంటల పాటు పూర్తిగా మోటారు వాహనాలను నిషేధించారు.

టీఎస్‌ఐఐసీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎంబార్క్ ఇండియా, ఐడెంసిటీ సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ జయేష్‌రంజన్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎంబార్క్ ఇండియా అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ నిపుణులు ప్రశాంత్‌కుమార్ బచ్చు పాల్గొన్నారు.
 
నేటి నుంచి ‘బయోడైవర్సిటీ’ సందర్శనంగచ్చిబౌలిలోని జీవవైవిధ్య పార్కును సోమవారం నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నట్టు ఈ సందర్భంగా జయేష్‌రంజన్ చెప్పారు. నగరంలో జీవవైవిధ్య సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తెచ్చిన మొక్కలను ఇక్కడ నాటారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.
 
ప్రతి ఆదివారం...  
నగరమంటే... రోడ్లపై పరుగులు తీసే కార్లే కాదు, ప్రజలు కూడా. కానీ రోడ్లపై పాదచారులు రోడ్డుపై అడుగుపెట్టే పరిస్థితి లేదు. రహదారులు వాహనాలకే పరిమితమైపోయాయి. ఫుట్‌పాత్‌లు లేవు. సైక్లింగ్ ఫ్రెండ్లీ వాతావరణం కనిపించదు. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కమ్యూనిటీ మూవ్‌మెంట్‌ను ప్రారంభించాం. తొలి ఈవెంట్ సక్సెస్ అయింది. ఇకపై ప్రతి ఆదివారం చేస్తాం.
 - ప్రశాంత్‌కుమార్ బచ్చు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ నిపుణులు, ఎంబార్క్
 
కాలుష్య రహితం కావాలి
కనీసం వారంలో ఒక రోజు రోడ్లపై కార్లు లేకపోతే కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పొల్యూషన్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో నగరవాసులు బాధపడుతున్నారు. ఐటీ కంపెనీలకు దగ్గర్లో ఉండేవారు తప్పనిసరిగా సైకిల్ పైనే రావాలని నిబంధన పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది.  
 - ప్రియాంక,
 గచ్చిబౌలి
 
పాత రోజులు రావాలి
పూర్వం సైకిళ్లు, జట్కాల వంటివి ఉండేవి. కాలుష్యం లేని నగరం ఎంతో ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు కుప్పలుతెప్పలుగా మోటారు వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. కాలుష్యం పెరిగి మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. వాహనాల హార్స్ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల వేగం పెరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
 - గిరిధర్, దిల్‌సుఖ్‌నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement