ఏం జరుగుతుందో... భయం భయం
నగర వాసుల కిడ్నాప్‌తో మళ్లీ తెరపైకి ఐఎస్‌ఐఎస్
సిటీబ్యూరో: ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) పేరు మరోసారి నగరంలో చర్చనీయాంశమైంది. ఆ ఉగ్రవాద సంస్థకు పట్టున్న లిబియాలోని సిర్టియో ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, గోపీ కృష్ణతో పాటు మరో ఇద్దరు కిడ్నాప్‌నకు గురవడంతో ఇది ఐఎస్‌ఐఎస్ పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల చెర నుంచి వారు క్షేమంగా విడుదలయ్యారన్న సమాచారం లేకపోవడంతో... నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌తో సిటీ యువతను ఆకర్షిస్తున్నారు. జీహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట తమ సంస్థల్లో సభ్యులుగా చేర్చుకునేందుకు పన్నిన పన్నాగాలను పోలీసులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు విరమించుకోవడం లేదు. తాజాగా కిడ్నాప్ ఉదంతంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు.
సిటీ యువతపై కన్ను...
ఐఎస్‌ఐఎస్ వైపు మొగ్గు చూపుతున్న వారిలో ఇంజినీరింగ్, మెడిసిన్ అభ్యసించే విద్యార్థులతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఉంటున్నారు. ఫేస్‌బుక్ ద్వారా ముందు చాటింగ్‌లోకి దింపుతారు. యువకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నెమ్మదిగా వారిని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. హుమయూన్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు గత ఏడాది ‘పవిత్ర యుద్ధం కోసం ఇరాక్ వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. అదృష్టం ఉంటే స్వర్గంలో కలుసుకుంటా’నని తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఆ యువకుడిని కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
అతడితో పాటు కరీంనగర్‌కు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి, చాంద్రాయణ గుట్టకు చెందిన ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ఆరునెలల కాలంలోనే ఐఎస్‌ఐఎస్‌లో చేరాలనుకున్న వారి సంఖ్య 84 వరకు ఉన్నట్లు సమాచారం. వీరిని నగర పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. వీరిలో కొందరిని ముందుజాగ్రత్త చర్యగా మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. ఇటువంటి ఘటనలపై ఇప్పటికే సిటీ పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు.