పనిసరే.. పైసలేవీ! | Loopholes detected in implementation of MGNREGS | Sakshi
Sakshi News home page

పనిసరే.. పైసలేవీ!

Published Thu, Apr 21 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

పనిసరే.. పైసలేవీ!

పనిసరే.. పైసలేవీ!

బకాయిల కోసం 12 లక్షల మంది ఉపాధి కూలీల ఎదురుచూపులు
► రెండు నెలలుగా రూ. 310 కోట్ల బకాయిలు
► కరువు కాలంలో పనుల్లేక తల్లడిల్లుతున్న పేదలు
► ఉపాధి కూడా ఆదుకోకపోవడంతో అరిగోస
► గ్రామాల్లో పథకంపై సన్నగిల్లుతున్న నమ్మకం
► డబ్బులివ్వకపోవడంతో పట్టణాలకు వలసబాట
► చట్టం ప్రకారం పనిచేసిన 15 రోజుల్లో డబ్బులివ్వాలి
► సర్కారు నిర్లక్ష్యంతో ఎక్కడా అమలుకాని నిబంధన

 
ఈమె పేరు ఒర్సు సక్కుబాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం. రెండు నెలల క్రితం చేసిన పనికి ఇప్పటివరకు డబ్బులు రాలేదు.  ఈమెకు రూ.2,260, భర్తకు రూ.2 వేల బకాయిలు రావాలి. రెక్కాడితేగానీ డొక్కాడని ఈ కుటుంబం డబ్బులందక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ‘‘డబ్బులిస్తే బియ్యం కొనుక్కునేటోళ్లం. అప్పు చేసి ఇంటి సామాన్లు తెచ్చుకుంటున్నాం. పైసలడిగితే రేపుమాపు అంటున్నారు’’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తోంది!
 
ఈమె పేరు పెంటగాని పద్మ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్. ఉపాధి పనులు చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళా సంఘం నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడు వాళ్లు డబ్బులు కట్టాలని అడుగుతుండడంతో తలపట్టుకుంది. ‘బయట కూడా అప్పు పుట్టడం లేదు. ఇంట్ల ఎల్లుడు కష్టమైతంది. రెండ్రోజులుగా ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటున్నం’ అంటూ గోడు వెల్లబోసుకుంది.
 
...ఇది ఒకరిద్దరి గోస కాదు.. చేసిన పనికి డబ్బులందక రాష్ట్రవ్యాప్తంగా 12.72 లక్షలమంది ఉపాధి కూలీలు ఇలాగే  నానా అవస్థలు పడుతున్నారు! ఎనిమిది వారాల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఉపాధి కూలీలకు రాష్ట్ర సర్కారు గత రెండు నెలలుగా దాదాపు రూ. 310 కోట్లబకాయిలు చెల్లించాల్సి ఉంది!

కరువు రక్కసి కబంధ హస్తాల్లో రాష్ట్రం బందీ అయింది. ఎటు చూసినా నెర్రెలిచ్చిన పొలాలు, అడుగంటిన చెరువులు, కుంటలు, చుక్కనీరు రాని బోర్లే దర్శనమిస్తున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతులంతా రోజువారీ కూలీలుగా మారిపోయారు. ఈ కరువు కాలంలోనైనా ఆధరువుగా నిలుస్తుందనుకున్న ఉపాధి హామీ పథకం ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. పని చూపడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, మండుటెండల్లో పని చేసినా నెలల తరబడి అందని కూలీ, క్షేత్రస్థాయిలో అంతులేని అవినీతి.. వెరసి ఈ పథకంపై కూలీలకు నమ్మకం సడలేలా చేస్తున్నాయి.

ఏ జిల్లాలోనూ ఉపాధి పనులు సవ్యంగా సాగడం లేదు. ఉన్న ఊర్లో పని కరువవడంతో తల్లీపిల్లలను వదిలి ఆలితోపాటు పట్నం పోతున్నారు రైతు కూలీలు! జిల్లా స్థాయిలో కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఉపాధి పనులను పట్టించుకోవడం లేదు. బాధ్యతలన్నీ పీడీల చేతుల్లో పెట్టడంతో పనులు సమగ్రంగా అమలు కావడం లేదు. గ్రామీణ స్థాయిలో పనులు కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన వారిని తొలగించడం, వారి స్థానాల్లో మరొకరిని నియమించకపోవడంతోనూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
 
సుప్రీం ఆగ్రహం వ్యక్తంచేసినా..
ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కరువు బారిన పడిన ప్రాంతాలకు తక్షణమే సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కరువు రోజుల్లో చేసిన పనికి ఏడాది తర్వాత డబ్బులు చెల్లిస్తే ఏం లాభం? మీరు నిధులివ్వకపోతే పనిచేయడానికి ఎవరూ రారు. తమ దగ్గర డబ్బుల్లేవని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి.. జనానికి సాయం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదు’’ అంటూ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాతే కేంద్రం ఇటీవల తన వంతుగా బకాయిలను విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ బకాయిలను విడుదల చేయలేదు.

కూలీ పెంచినా ఏం ప్రయోజనం..?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రూ.180 నుంచి రూ.194కు పెంచింది. అయినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం సగటున రోజుకూ రూ.వంద కూడా పడడం లేదని, చేసిన పనికి నెలలుగా ఎదురుచూస్తున్నామని కూలీలు గోడు వెల్లబోసుకుంటున్నారు. కూలి పెంచినా డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. కరువు మండలాల్లో ప్రభుత్వం ఇటీవల పని దినాలను 100 రోజుల నుంచి 150కి పెంచింది. అయితే అది పూర్తిస్థాయిలో అమలైతేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కరువుతో పల్లెల్లో ఏ పని దొరకడం లేదు. దీంతో జనం కూలి తక్కువైనా ఉపాధి పనికే వెళ్తున్నారు. కానీ పని చేసినా డబ్బులు ఎప్పుడు చేతికందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కరువు కాలంలో పట్టెడన్నం కోసం మండుటెండలో పనిచేస్తే.. ఎప్పుడో డబ్బులిస్తే ఏం ప్రయోజనమని కూలీలు వాపోతున్నారు. ఏ వారం డబ్బులు ఆ వారమే ఇవ్వాలని కోరుతున్నారు.

15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సిందే..
ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కూలీకి పనిచేసిన15 రోజుల్లోనే కూలి డబ్బులు చెల్లించాలి. లేకుంటే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. కానీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.

కూలీల డబ్బులు దారిమళ్లాయా?
ఉపాధి హామీ పథకంలో పని చేసిన వారికి పంపిణీ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కేంద్రం తన వాటాగా విడుదల చేస్తున్న ఉపాధి నిధులను రాష్ట్రం ఇలా ఇతర పథకాలకు మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి.

వడదెబ్బతో మరణిస్తున్న కూలీలు
గత పక్షం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సగటున 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 మంది కూలీలు చనిపోయారు. గ్రామాల్లో ఏ పని దొరక్క వృద్ధులు సైతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. అలాంటివారు ఎండలకు తాళలేకపోతున్నారు.

వేసవి వెళ్లాక టెంట్లు వేస్తారా?
పనిచేసే చోట కూలీల కోసం టెంట్లు వేయాలి. మెడికల్ కిట్లు అందుబాటు ఉంచాలి. చిన్నపిల్లల ఆలనకు ప్రత్యేక  సౌకర్యం కల్పించాలి. కానీ ఇవేవీ ఎక్కడా కనిపించడం లేదు. సగం వేసవి గడిచిన తర్వాత ప్రభుత్వం నీడ కోసం టెంట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆదేశాలు కలెక్టర్లకు అందాయి. పనిచేసే చోట ఈ టెంట్లు వేయాలంటే కనీసం నెలన్నర సమయమైనా కావాల్సిందే! టెంట్ల కొనుగోళ్లకు కమిటీలు నియమించడం, టెండర్లు, సరఫరా ప్రక్రియ పూర్తయ్యే సరికి వేసవి వెళ్లిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
 
అంతులేని అవినీతి.. అరకొర రికవరీ

ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎంత దక్కుతుందో తెలియదు గానీ.. ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చాలాచోట్ల అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేస్తున్న వారి సంఖ్య కన్నా ఎక్కువ మంది పేర్లు రాయడం, వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాక పంచుకోవడం వంటివి చేస్తున్నారని కూలీలు చెబుతున్నారు. ఇటీవల నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఈ తరహా అవినీతి వెలుగు చూస్తోంది. అయితే రికవరీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. పనుల్లోంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి పై అధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో కొనసాగుతున్నారు.
 
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
► నల్లగొండ జిల్లాలో రెండు నెలల బకాయిలు రూ.50 కోట్లకు చేరాయి. గతంలో రోజువారీ కూలీల సంఖ్య 1.70 లక్షలు ఉండేది. ఎండల నేపథ్యంలో అది 1.24 లక్షలకు చేరింది. రెండు నెలల్లోనే ఉపాధి కూలీలు 50 వేల వరకు తగ్గిపోయారు.

► ఖమ్మం జిల్లాలో 2.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. కానీ క్రియాశీలక కూలీలు 90 వేల నుంచి 96 వేల మందే. ఈ జిల్లాలో కూలీలకు రూ.35 కోట్ల వేతనం చెల్లించాల్సి ఉంది.

► మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది వారాలపాటు పనిచేసిన కూలీలకు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా డబ్బులందక పోవడంతో కూలీలు వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,14,958 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మార్చిలో కూలీల నమోదు 1.5 లక్షలకు చేరుకోగా ప్రస్తుతం 1.14 లక్షలకు పడిపోయింది.

► నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వీరందరికీ రూ.15.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు వెంటనే చెల్లించాలని రోజుకో చోట కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు.

► రంగారెడ్డి జిల్లాలో 33 గ్రామీణ మండలాలుండగా.. ఇందులో 24 మండలాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 1,39,851 మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.42 కోట్లు బకాయిలున్నాయి.

► కరీంనగర్ జిల్లాలో రోజుకు సగటున లక్ష మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వేతనాలు కూలీలకు చెల్లించాల్సి ఉంది.

► ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది కూలీలకు ఈ ఏడాది జనవరి నుంచి డబ్బులు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.64 కోట్లు ఉన్నాయి.

► మెదక్ జిల్లాలో లక్షకుపైగా కూలీలు ఉండగా వారికి ప్రభుత్వం రూ.11 కోట్ల మేర బకాయి పడింది.

► వరంగల్‌లో 1..04 లక్షల మంది కూలీలున్నారు. వీరికి రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, పేరుకుపోయిన బకాయిల వివరాలివీ..
 
(కూలీల సంఖ్య లక్షల్లో.. బకాయిలో రూ.కోట్లలో..)
  జిల్లా                    కూలీలు         బకాయిలు
 నల్లగొండ                    1.24            50
 ఖమ్మం                    2.50              35
 మహబూబ్‌నగర్        1.14              29
 నిజామాబాద్             1.80            15.95
 రంగారెడ్డి                   1.39            42
 కరీంనగర్                  1                 30
 ఆదిలాబాద్               1.55             64
 మెదక్                    1.06             11.40
 వరంగల్                 1.04              32.6
 మొత్తం                  12.72            310
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement