=బెంగళూరు ఏటీఎంపై దాడి ఘటనతో బెంబేలు
=ఇక్కడా ఎడాపెడా రెచ్చిపోతున్న దొంగలు
=సెక్యూరిటీ గార్డు లేని కేంద్రాలే ఎక్కువ
=సీసీ కెమెరాలతోనూ ఫలితాలు అరకొరే
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో నగరంలోని ఏటీఎం కేంద్రాలు ఎంతవరకు భద్రం అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక్కడా ఏటీఎంల లూటీ యత్నాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డవుతున్న ఫుటేజ్‌లు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. కారణం సెక్యూరిటీ పటిష్టంగా లేకపోవడమే. ఈ పరిణామాల నేపథ్యంలో వీటికి పరిష్కారం ఏమిటి? ఏటీఎం కేంద్రాలు భద్రంగా మారేది ఎన్నడు? అనే ప్రశ్నలే ఇప్పుడు అందరి మనసుల్లోనూ మెదులుతున్నాయి.
అందరి క ళ్లూ ఆ కేంద్రం పైనే..
కెమెరాలు, క్లోన్డ్ కార్డులతో తెగబడే నీటుగాళ్లు.. గడ్డపారలు, గ్యాస్ కట్టర్లతో విరుచుకుపడే నాటుగాళ్లు.. ఇలా అందరి కళ్లూ ఏటీఎం సెంటర్లపైనే ఉంటున్నాయి. ఎవరికి వారు అందినకాడికి దోచేస్తున్నారు. దోపిడీకి యత్నిస్తున్నారు. నిత్యం అనేక కేంద్రాలపై విరుచుకుపడుతున్నా వాటి లాకర్లు తెరుచుకోకపోవడంతో సొమ్ము భద్రంగానే ఉంటోంది. కానీ బెంగళూరు తరహా ఉదంతం జరిగితే మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి.
సెక్యూరిటీ లోపాలే కారణం
నీటుగాళ్లు కాని, నాటుగాళ్లు కాని, నేరగాళ్లు కాని... ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోవడానికి సెక్యూరిటీ లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నా వాటి నిర్వహణను పట్టించుకోకపోవడం జరుగుతోంది. మరోపక్క గార్డు లేనివి గాలికి వదిలేసి ఉంటే, ఉన్న వాటిలోనూ తక్కువ జీతాలకు వస్తారనే ఉద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని వృద్ధులు, అశక్తుల్ని సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఏటీఎం కేంద్రంగా నీటుగాళ్లు చేసే మోసాలు, నేరాలపై ఏమాత్రం అవగాహన ఉండట్లేదు.
సీసీ కెమెరా ఉంటే సరిపోతుందా..?
దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఉదంతం జరిగినా ‘తక్షణం స్పందించే’ పోలీసులకు వెంటనే గుర్తుకువచ్చే అంశం సీసీ కెమెరా. యథావిధిగా బుధవారం సైతం ఏటీఎం కేంద్రాంల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటిలో రికార్డయ్యే ఫీడ్‌ను నిర్ణీత కాలం వరకు భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసేశారు. ఈ కెమెరాలు బెంగళూరులో మాదిరి జరిగే దారుణాన్ని రికార్డు చేస్తాయి తప్ప జరగకుండా ఆపలేవనే విషయం పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఏటీఎం కేంద్రాల్లో చోటు చేసుకున్న చోరీ యత్నం ఉదంతాల్లో అనేకం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫీడ్‌ను సేకరించిన పోలీసులు అందులోని అనుమానితుల ఫొటోలు కూడా విడుదల చేశారు. అయితే కొలిక్కి వచ్చిన కేసులు మాత్రం సగానికి సగమే.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
బెంగళూరు ఉదంతం నేపథ్యంలో అప్రమత్తమయ్యాం. నగర వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాల వద్ద గస్తీ పెంచాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. సెక్యూరిటీ గార్డులు లేని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి గంటకూ గస్తీ వాహనాలు వెళ్లి తనిఖీ చేయాలని స్పష్టం చేశాం. నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 15 ఏటీఎం కేంద్రాల్లో చోరీ యత్నం జరిగింది. మూడు చోట్ల సెక్యూరిటీ గార్డులపై దాడులు చేశారు. వీటిలో 8 కేసులు కొలిక్కి తెచ్చి ఆరుగురిని అరెస్టు చేశాం. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
- అనురాగ్ శర్మ, కొత్వాల్
ఎనీటైమ్ లూటీ!
Published Thu, Nov 21 2013 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement