ఏటీఎంలకు కొరవడిన భద్రత
► పది శాతానికి కాపలాదారులు
► అన్నింటికీ సీసీ కెమెరాలే దిక్కు
► సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఆయుధాలు లేని వైనం
► పట్టించుకోని ప్రయివేట్ ఏజెన్సీలు
► సులువవుతున్న చోరుల పని
జిల్లాలో ఏటీఎంలకు భద్రత కరువైంది. మదనపల్లె ఏటీఎంలో భారీ చోరీతో ఈ విషయం బయటపడింది. 90శాతం ఏటీఎంల వద్ద కాపలాదారు కూడా లేని పరిస్థితి. చాలా ఏటీఎంలకు సీసీ కెమెరాలు తప్ప మరే నిఘా లేదు. కొన్నిచోట్ల భద్రత విధులు నిర్వహించే సిబ్బంది వద్ద దొంగలను ప్రతిఘటించేందుకు అవసరమైన ఆయుధాలు కూడా లేవని తేలింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రధాన కేంద్రాల్లో సైతం భద్రత అంతంతమాత్రమే. దీంతో ఏటీఎంలోని నగదు భద్రత ప్రశ్నార్థకమైంది. ఏటీఎంలకు రాత్రి వేళ వెళ్లాలంటే వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. లక్షల రూపాయలుండే యంత్రాలను ఇలా గాలికొదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరుపతి (అలిపిరి): మదనపల్లెలో ఇటీవల జరిగిన ఏటీఎం చోరీ పోలీసులకు సవాలుగా మారింది. కనీస ఆనవాళ్లు లేకుండా రూ.23 లక్షలు దొంగలు కొల్ల్లగొట్టడం చూస్తే ఏటీఎంల వద్ద ««భద్రత ఎలా ఉందో అర్థమవుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 712 ఏటీఎంలలో రోజూ రూ.7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నగదును బ్యాంకులు అందుబాటులో ఉంచుతాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాక్ శాఖలు ఒక్కో ఏటీఎంలలో రూ.20 నుంచి 40 లక్షల నగదును ఉంచుతున్నాయి. ఇంత మొత్తంలో ఏటీఎంలలో నగదు ఉంచుతున్నా భద్రతను మా త్రం విస్మరిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో ఏటీఎంలకు రక్షణ లేకుం డాపోయింది. దీంతో ప్రజలు అక్కడకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏజెన్సీలతో బేజారు..
ప్రభుత్వరంగ బ్యాంకు శాఖలు ఏటీఎంల నిర్వహణ బాధ్యత ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిం చాయి. ఫలితంగా భద్రతపై అంత శ్రద్ధ ఉండటం లేదు. ఏటీఎంలు మరమ్మతుకు గురైనా ఏజెన్సీ ప్రతినిధులు సకాలంలో స్పందించడం లేదు. మదనపల్లె ఎస్‌బీఐ ఏటీఎంపై పట్టపగలే దొంగలుపడి దొచుకెళ్లినా ఏజెన్సీ ప్రతినిధులు స్పందించలేదు. ఆయుధాల సహాయంతో ధ్వంసానికి ప్రయత్నిస్తే ఏజెన్సీకి ఎస్‌ఎంఎస్ అప్రమత్తత సమాచారం వెళుతుంది. ఇక్కడ చోరీపై సమాచారం వెళ్లినా ఏజెన్సీ ప్రతినిధులు పట్టించుకోలేదని తెలిసింది. ఏజెన్సీల నిర్లక్ష్యం దొంగలకు కలిసి వస్తోందనే విమర్శలున్నాయి.
భద్రత కుదింపు..
ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్ వంటి పెద్ద శాఖలు ఏటీఎం కేంద్రాలకు భద్రత సిబ్బందిని కుదించాయి. ఏజెన్సీలకు అప్పగించామని ఇలా చేస్తున్నాయి. గతంలో ఏటీఎం కేంద్రాలకు పూర్తి స్థాయి భద్రత ఉండేది. కాలక్రమేణా సీసీ కెమెరాల వ్యవస్థ అందుబాటులోకి రావడంతో సెక్యూరిటీ సిబ్బందిని కుదించారు. జిల్లా వ్యాప్తంగా 10 శాతం మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారు. మిగిలిన వాటికి సీసీ కెమెరాలే దిక్కు. ఏటీఎంల భద్రత సిబ్బంది కూడా ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వారే. దొంగలను ప్రతిఘటించేందుకు కనీస ఆయుధాలు కూడా ఉండవు.
♦ 2016 జనవరిలో తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలో ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం జరిగింది.
♦ 2016 ఏప్రిల్‌లో తిరుమలలో ఏటీఎం సీక్రెట్ పిన్ నంబర్లు తెలుసుకుని నగదు అపహరిస్తున్న రమేష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
♦ 2015లో ఏటీఎం కేంద్రాల చోరులను శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
♦ 2014లో ఏపీఎస్‌పీటీసీఎల్ కార్యాలయం ఎదుట ఉన్న ఏటీఎంలో చోరీకి పాల్పడి సెక్యూరిటీ సిబ్బందిని హతమార్చారు.
♦ 2014 నవంబర్‌లో వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో రూ.అరకోటి నగదు అపహరించుకుపోయారు.
ఏజెన్సీలదే బాధ్యత
ఏటీఎం నిర్వహణ బాధ్యతను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు బ్యాంకులు అప్పగించాయి. చిన్నపాటి సమస్యలు తలెత్తినా వాళ్లే బాధ్యత వహించాలి. భద్రతా వ్యవస్థ మొత్తం ఏజెన్సీ పరిధిలో ఉంటుంది. మదనపల్లెలో చోరీకి గురైన మొత్తాన్ని ఏజెన్సీ నుంచే రాబడతాం.
–పూర్ణచంద్రుడు, ఏజీఎం, ఎస్‌బీఐ మదనపల్లి డివిజన్
భద్రత డొల్ల
Published Tue, Sep 5 2017 3:00 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM
Advertisement
Advertisement