నిమజ్జనంపై వైఫై నిఘా.. | WiFi immersed in surveillance | Sakshi
Sakshi News home page

నిమజ్జనంపై వైఫై నిఘా..

Published Tue, Aug 30 2016 11:03 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

నిమజ్జనంపై వైఫై నిఘా.. - Sakshi

నిమజ్జనంపై వైఫై నిఘా..

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు పెను సవాలైన గణేష్‌ ఉత్సవాల నిమజ్జన ఘట్టాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నిమజ్జన భద్రత ఏర్పాట్లలో భాగంగా అత్యాధునికమైన వైఫై బేస్డ్‌ సీసీ కెమెరాలు వినియోగించాలని నిర్ణయించారు. ఈ దృశ్యాలను క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ ట్యాబ్‌్సలోనూ చూసే అవకాశం కల్పించనున్నారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌ వద్ద ఏ క్రేన్‌ ద్వారా ఎన్ని విగ్రహాలు నిమజ్జనమయ్యాయనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నారు.
 
సాధారణ కెమెరాలతో కనెక్టివిటీ సమస్యలు..

ప్రస్తుతం నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ అధికారులు ఏర్పాటు చేసిన, కమ్యూనిటీ ప్రాజెక్టు కింద అందుబాటులోకి వచ్చిన, పోలీసు విభాగం నెలకొల్పిన కెమెరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇవి కేబుల్‌ (వైరు) ఆధారంగా పని చేసేవి కావడం గమనార్హం. నిమజ్జనం రోజు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్‌ శాఖ అధికారులు అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేయనుండటంతో దీంతో కీలక ఘట్టాన్ని పర్యవేక్షించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 సమస్యలను అధిగమించేందుకు కసరత్తు...
ఈసారి గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసు ఐటీ సెల్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధాన ఊరేగింపు మార్గమైన బాలాపూర్‌–హుస్సేన్‌సాగర్‌ మధ్య, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ వైఫై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కెమెరాలు వైర్లతో నిమిత్తం లేకుండా ‘4జీ’ పరిజ్ఞానంతో కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో  (సీసీసీ) అనుసంధానించి ఉంటాయి.

ప్రతి కెమెరాలు గరిష్టంగా 12 గంటల బ్యాకప్‌ సామర్థ్యం కలిగిన యూపీఎస్‌లు ఉంటాయి. ఫలితంగా విద్యుత్‌ సరఫరా, వైర్లు తెగిపోవడం తదితరాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా పని చేస్తూనే ఉంటాయి. ప్రధాన ఊరేగింపు మార్గంలో 18, సాగర్‌ చుట్టూ 15 వైఫై బేస్డ్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

  అన్నీ కవర్‌ చేసేలా
ప్రధాన ఊరేగింపు మార్గంలో ఏర్పాటు చేసే కెమెరాలను ఎల్తైన భవనాలపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేవలం 18 కెమెరాలతో మార్గం మొత్తం కవర్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రెండు కెమెరాల మధ్య ఉండాల్సిన దూరం, దిశలు తదితరాలను సాంకేతికంగా నిర్థారిస్తున్నారు. ఈ కెమెరాల కంట్లో పడకుండా ఏ దశలోనూ, ఏ కోణమూ మిస్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోపక్క ఈ కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను సీసీసీలో ఉండే సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకూ వారి ట్యాబ్‌్సలో అందించేలా ఏర్పాటు జరుగుతోంది. ఫలితంగా అధికారులు ఈ 33 కెమెరాల్లో ఏ దృశ్యాలనైనా తన ట్యాబ్‌ ద్వారా ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

 ‘విగ్రహాల’ లెక్కింపూ సాంకేతికంగానే...
నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టు ఏర్పాటు చేసే క్రేన్లలో ఏ ఒక్క క్రేన్‌ వద్ద నిమజ్జనం మందకొడిగా సాగుతున్నా... దాని ప్రభావం ఇతర క్రేన్లతో పాటు ట్రాఫిక్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి క్రేన్‌ ద్వారా నిమజ్జనమయ్యే విగ్రహాలను ఎప్పిటికప్పుడు లెక్కిస్తూ బేరీజు వేస్తుంటారు. ఇందుకుగాను ప్రతి క్రేన్‌ వద్ద ఓ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి, అతడి ద్వారా విగ్రహాల లెక్కల్ని మాన్యువల్‌గా తీసుకుంటారు. ఇందుకుగాను ప్రత్యేకంగా యాప్‌ రూపొందిస్తున్నారు.

క్రేన్ల వద్ద ఉండే కానిస్టేబుళ్ల ఫోన్లలో దీన్ని నిక్షిప్తం చేస్తారు. నిమజ్జనమయ్యే ప్రతి విగ్రహం వివరాలను ఆయా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఈ వివరాలు కంట్రోల్‌రూమ్‌తో పాటు క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల ట్యాబ్‌్సలోనూ అందుబాటులో ఉంటాయి. ఏదైనా క్రేన్‌ వద్ద నిమజ్జనాలు తక్కువ సంఖ్యలో అవుతున్నట్లు ఈ యాప్‌ ద్వారా గుర్తిస్తే... వెంటనే ఆ సమీపంలోని వైఫై సీసీ కెమెరాల దృశ్యాలనూ ట్యాబ్‌లో చూసి కారణాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వచ్చే నెల 15న ప్రధాన నిమజ్జనం జరుగనున్న నేపథ్యంలో దీనికి వారం–పది రోజుల ముందే వీటి ఏర్పాటు, ట్రయల్‌ రన్‌ పూర్తి చేయడానికి సన్నాహాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement