కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జన ర్యాలీ, ట్యాంక్ బండ్‌వద్ద నిమజ్జనోత్సవాన్ని పరిశీలిస్తున్న హోంమంత్రి నాయిని
15 వేల కెమెరాలతో నిమర్జనం నిఘా
Published Thu, Sep 15 2016 10:32 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ఊరేగింపు మార్గాలతో పాటు ఆ చుట్టపక్కల ప్రాం తాలు, రహదారుల, హుస్సేన్‌సాగర్ చుట్టూ పర్యవేక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. శోభాయాత్రం జరిగే రూట్‌లో అణువణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటూ సీసీ, పీటీజెడ్, వైఫై తదితర ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు.
మొత్తమ్మీద 12 వేల శాశ్వత సీసీ కెమెరాలకు తోడు మరో 3 వేల అదనపు కెమెరాలు ఏర్పాటు చేసి.. వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలీసుస్టేషన్, ఏసీపీ, డీజీపీ కార్యాలయాల్లోనూ, ఎంపిక చేసిన అధికారులు తమ సెల్‌ఫోన్ ద్వారానూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. మరోపక్క లింకేజ్‌ను డీజీపీ కార్యాలయానికి సైతం ఇచ్చి అక్కడ కూడా ఓ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
వీటిని డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. హుస్సేన్‌సాగర్, ఎంజే మార్కెట్, చార్మినార్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే ఎదుర్కోవడానికి నిఘా కొనసాగించారు. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా ఊరేగింపు రూట్‌తో పాటు చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేస్తూ నిఘా కొనసాగించారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీ వీవీ శ్రీనివాసరావు, ఐజీలు చారు సిన్హా, ఎంకే సింగ్ ఇక్కడే మకాం వేసి పరిస్థితుల్ని ఆద్యంతం పర్యవేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి గురువారం సాయంత్రం సీసీసీని సందర్శించారు. ఇక్కడి నుంచి నిమజ్జనం ఊరేగింపు, ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు.
Advertisement
Advertisement