బతుకమ్మకు గిన్నిస్ రికార్డు!
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అంతర్జాతీయ గుర్తింపు
• హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో బతుకమ్మ మహా ప్రదర్శ
• ఒకే సమయంలో బతుకమ్మ ఆడిన 9,292 మంది మహిళలు
సాక్షి, హైదరాబాద్: వర్షం కురిసి వెలిసిన ఆహ్లాదకర వాతావరణం.. వెలుగులు విరజిమ్మే అందమైన నిలువెత్తు పూల గోపురం.. దాని చుట్టూ వేలాది మంది మహిళలు.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలతో ఆటలు. ఒకవైపు ఆనందోత్సాహాలు, మరోవైపు ఉత్కంఠ భరిత క్షణాలు.. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మ మహా ప్రదర్శన దృశ్యమిది. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవం గిన్నిస్‌బుక్‌లో సగర్వంగా చోటు దక్కించుకుంది. శనివారం లాల్‌బహదూర్ స్టేడియంలో వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఆడుతుండగానే.. ఈ ప్రదర్శన గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌కు అర్హత సాధించినట్లు పరిశీలకులు కుమరన్, జయసింహా ప్రకటించారు.
12 వేల మందికిపైగా మహిళలు...
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 12 వేలమంది మహిళలు హాజరయ్యారు. స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మను తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో తీర్చిదిద్దారు. దానిచుట్టూ చిన్నచిన్న బతుకమ్మలను పెట్టారు. వాటి చుట్టూ 35 వరుసల్లో సుమారు 10 వేలమంది మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో స్టేడియం అంతా సందడి వాతావరణం నెలకొంది.
ఒకవైపు నేలపై రంగు రంగుల పూలతో వెలసిన ఇంద్రధనస్సులు, మరోవైపు నింగిలో హరివిల్లులై విరబూసిన మతాబులు ఉత్సవాన్ని నయనానందకరం చేశాయి. సాయంత్రం నాలుగు గంటలకు పడిన వర్షం కారణంగా ఉత్సవానికి కాసేపు ఆటంకం కలిగినా.. తర్వాత మహిళలంతా మరింత ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వేడుకలకు వచ్చిన మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రికార్డు ఇలా....
ఒకే రకమైన పాట, ఆటతో వేలాది మంది మహిళలు ఒకచోట చేరి జరుపుకొనే పండుగగా ఇప్పటివరకు కేరళలోని ఓనమ్ పండుగ ప్రపంచ రికార్డుగా ఉంది. 2015లో 5,211 మంది మహిళలు పాల్గొన్న ఓనమ్ గిన్నిస్‌బుక్‌లో నమోదైంది. బతుకమ్మకు అటువంటి రికార్డు అవసరమని భావించిన ప్రభుత్వం.. సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో గిన్నిస్ రికార్డు కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. శనివారం జరిగిన మహా ప్రదర్శనకు 12 వేల మంది హాజరుకాగా.. అందులో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన 10,029 మంది మహిళలకు నిర్వాహకులు ట్యాగింగ్ చేశారు. అయితే వర్షం తదితరాలవల్ల కొంత మంది మధ్యలో బయటకు వెళ్లి రావడంతో.. బతుకమ్మ ఆడినవారు 9,292 మందిగా లెక్క తేల్చారు. దీంతో ఓనమ్ రికార్డును బతుకమ్మ అధిగమించింది. దాదాపు రెండు గంటల పాటు బతుకమ్మ ఆడినప్పటికీ ఎక్కువమంది ఆడిన సమయం 11.07 నిమిషాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గిన్నిస్‌బుక్ పరిశీలకులు తెలిపారు.
సెలబ్రిటీల తళుకులు..
వేలాది మంది మహిళలతో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, క్రీడాకారిణి సానియా మీర్జా, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, మిస్ ఇండియా క్రౌన్ రష్మి ఠాకూర్, పూనమ్‌కౌర్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పలు దేశాల నుంచి వచ్చిన 40 మంది మహిళలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రయత్నం ఫలించింది
బతుకమ్మ పండుగకు ఉదాత్తమమైన చరిత్ర, లక్ష్యం ఉన్నాయి. ఇటువంటి గొప్ప సంస్కృతిని ప్రపంచానికి చాటాలనే మా ప్రయత్నం ఫలించింది. - బుర్రా వెంకటేశం,సాంస్కృతికశాఖ కార్యదర్శి
మహిళా శక్తికి కృతజ్ఞతలు
వర్షం వచ్చినా మహిళలు వెనక్కి తగ్గకుండా ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళా శక్తికి కృతజ్ఞతలు.
- రామ్మోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్
మహిళలకు గర్వకారణం
ప్రపంచంలో పూల(బతుకమ్మ)కు పూజచేసే సంస్కృతి తెలంగాణలో మినహా మరెక్కడా లేదు. ఈ రికార్డు తెలంగాణ మహిళలందరికీ గర్వకార ణం. - స్వామిగౌడ్, శాసన మండలి చైర్మన్
బతుకమ్మే స్ఫూర్తి
నాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి, నేడు ప్రపంచ గుర్తింపు లభించడానికీ బతుకమ్మే కారణమైంది. ప్రదర్శనలో పాల్గొన్న
మహిళలందరికీ అభినందనలు. - చందూలాల్, పర్యాటకశాఖ మంత్రి
చాలా సంతోషంగా ఉంది
బతుకమ్మకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించ డం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బతుకమ్మ ఆడాలనే ఇక్కడికి వచ్చా.
- సానియా మీర్జా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
బతుకమ్మకు మరింత కీర్తి
తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కడం మరింత కీర్తిని పెంచింది. కేరళలోని ఓనమ్ పండుగను మించి తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం గర్వకారణం. - నాయిని నర్సింహారెడ్డి, హోంమంత్రి