సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనపై ఇప్పటికీ సందిగ్ధత వీడని పరిస్థితి నెలకొంది. ఆదిలోనే ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపడం, దర్యాప్తు నాలుగు చేతులు మారడం, సాక్షులు ఎదురు తిరగడం వంటివెన్నో ప్రాసిక్యూషన్ విఫలం కావడానికి కారణమయ్యాయి. అసలు మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో దోషులు ఎవరనేది ‘మిస్టరీ’గా మారిపోయింది.
పోలీసుల అత్యుత్సాహంతో..
మక్కా మసీదులో.. అదీ శుక్రవారం ప్రార్థనల తర్వాత బాంబు పేలుడు జరగడంతో పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘాతుకానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) కారణమని.. హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది బిలాల్ అలియాస్ షాహెద్ బాధ్యుడని ప్రాథమికంగా భావించారు.
తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో.. కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలన్న అత్యుత్సాహంతో పోలీసులు దాదాపు రెండు వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఒక వర్గానికి చెందిన వారే కావడం, అందులోనూ కొందరికే బిలాల్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో మొదటి ఎదురుదెబ్బ తగిలింది.
అనుమానితుల్లో 38 మందిని మక్కా మసీదు పేలుడులో బాధ్యుల్ని చేస్తూ అరెస్టు చేయగా.. మరో 180 మందిపై గోపాలపురం పోలీసుస్టేషన్‌లో కుట్ర కేసు నమోదు చేశారు. కుట్ర కేసు వీగిపోగా.. పేలుడు కేసులో అనుమానితులుగా పేర్కొన్న వారికి కోర్టులో క్లీన్‌చిట్ లభించింది. దాంతో వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పోలీసుల అత్యుత్సాహంతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడింది.
గందరగోళంగా దర్యాప్తు..
మక్కా మసీదులో పేలుడు కేసు దర్యాప్తు సైతం కలగాపులగంగా సాగింది. ఆ ఘటనపై ప్రాథమికంగా స్థానిక హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. అనంతరం అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు మార్చారు. కానీ హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు, అరెస్టుల తీరుపై విమర్శలు రావడంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను రంగంలోకి దింపారు. అజ్మీర్ దర్గాలో పేలుడు ఘటనకు సంబంధించి రాజస్తాన్ పోలీసులు చేసిన అరెస్టులతో మక్కా మసీదు పేలుడు కేసు చిక్కుముడి వీడింది.
కొందరు నిందితులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వారిపై చార్జిషీట్ సైతం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చేలోగా కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఏర్పాటు చేయడంతో.. కేసులు దాని పరిధిలోకి వెళ్లాయి. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ మరికొందరు నిందితులను అరెస్టు చేసి, మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఒక్కొక్కరు ఒక్కో తీరులో, వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం కేసులో ఓ స్పష్టత లేకుండా చేసింది.
ప్రత్యక్ష సాక్షులు కరువు
ఈ కేసులో ఎక్కడా ప్రత్యక్ష సాక్షులు లేకుండా పోయారు. 2007లో పేలుడు జరగగా.. 2010లో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ లోపు అనేక సాక్ష్యాధారాలు మాయమైపోయాయి. 2007లో హైదరాబాద్‌లో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతోపాటు పలు ఇతర కారణాల నేపథ్యంలో పక్కా సాంకేతిక ఆధారాలు లభించలేదు. కేవలం సందర్భానుసారం నిందితులను చూసిన, పరిణామాలు తెలిసిన సాక్షులు మాత్రమే ఈ కేసులో కీలకంగా మారారు. వారిలోనూ 50 మందికిపైగా కోర్టులో దర్యాప్తు సంస్థకు ఎదురు తిరిగారు.
బాంబు పేలుళ్లకు వాడిన సెల్‌ఫోన్లను ఉగ్రవాదులకు విక్రయించిన దుకాణం యజమాని, ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన వారితో పాటు అనేక మంది కీలక సాక్షులు ప్రతికూలంగా మారారు. ఈ కేసులో ఆరో నిందితుడు స్వామి అసీమానంద ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంపైనా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇవన్నీ తీర్పు ప్రతికూలంగా రావడానికి కారణమయ్యాయి. మొత్తంగా అసలు 2007లో మక్కా మసీదులో పేలుడుకు పాల్పడింది ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు ప్రతిని అధ్యయనం చేశాక.. ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.
ఆ కమిషన్ నివేదిక ఏమైంది?
మక్కా మసీదు పేలుడు ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు పోలీసు కాల్పుల వరకు వెళ్లాయి. మొఘల్‌పుర పెట్రోల్ పంపు ప్రాంతంలో ఐదుగురు కన్నుమూశారు.
తీవ్రంగా విమర్శలు రావడంతో.. పోలీసు కాల్పుల ఉదంతంపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ వి.భాస్కర్‌రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. సుదీర్ఘ విచారణ జరిపిన ఆ కమిషన్ 2010లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని పూర్తి వివరాలు ఏమిటి, దాని ఆధారంగా తీసుకున్న చర్యలేమిటన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment