
‘మల్లన్న సాగర్’కు రిజర్వాయర్ అవసరం లేదు
మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు.
గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఇక్కడి ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు పెద్ద రిజర్వాయర్లు అవసరం లేదని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం, ఐక్యరాజ్యసమితి నీటిపారుదల రంగం మాజీ సలహాదారు టీ హనుమంతరావు లాంటి నిపుణులు విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రిజర్వాయర్ నిర్మాణానికి పెద్ద మొత్తంలో పేదల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. రిజర్వాయర్లు అవసరం లేకుండా కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించవచ్చన్నారు. ఈ విధానాన్ని పరిశీలించడానికి ఫోరం ఆధ్వర్యంలో బుధవారం హరియాణాలోని జవహర్‌లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించినట్టు తెలిపారు. ఇక్కడ రిజర్వాయర్ అవసరం లేకుండానే వివిధ స్టేజ్‌లలో లిఫ్టుల ద్వారా ఎగువ ప్రాంతంలోని రెండు జిల్లాల పరిధిలో 6 లక్షల హెక్టార్లకు యమునా నది నీటిని అందిస్తున్నారని వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న విధానాలను ఈ నెల 16న మల్లన్న సాగర్ ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.